Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ‌ర్సెస్ కెప్టెన్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2019 11:08 AM GMT
కేసీఆర్ వ‌ర్సెస్ కెప్టెన్‌!
X
తెలంగాణ‌లో సూర్యాపేట జిల్లా హుజూర్‌ న‌గ‌ర్ ఉప పోరు ఇప్పుడు కేసీఆర్ వ‌ర్సెస్ కెప్టెన్ న‌డుమ పోరుగా మారింది. అంతే కాదు.. ఈ ఉప పోరు ఇద్ద‌రి రాజ‌కీయ జీవితాల‌ను ప్ర‌భావితం చేయ‌నున్న‌ది. అధికార పార్టీ విజ‌య‌మా.. ప్ర‌తిప‌క్ష పార్టీకి విజ‌య‌మా.. అనేది తేలేది రేపే. హుజూర్‌ న‌గ‌ర్ ఎన్నిక‌ల్లో వీర‌మో వీర‌స్వ‌ర్గ‌మో అనే విధంగా అధికార‌ - ప్ర‌తిప‌క్ష పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉప ఎన్నిక ప్ర‌చారం శ‌నివారంతో ముగిసింది.. సోమవారం ఎన్నిక‌లు జ‌రుగున్న‌నున్నాయి.. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఎలా ఉందో తేల‌నుంది. ఈ ఎన్నిక ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు - పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ప్రతిష్టాత్మ‌కంగా మారాయి. ఈ ఎన్నిక ఇద్ద‌రి రాజకీయ జీవితానికి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది.

హుజూర్‌న‌గ‌ర్‌లో ఇప్ప‌టికి కాంగ్రెస్ పార్టీదే ఆధిప‌త్యం. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ప్ర‌భంజ‌నం వీచినా కూడా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డి గెలుపును ఆగ‌లేదు. 2009 నుంచి ఈ స్థానం ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కంచుకోట‌గా మారినప్ప‌టికి ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భార్య ప‌ద్మావ‌తి గెలుపు అంత సులువు కాద‌ని తేలిపోయింది.. గులాబీ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఏడువేల ఓట్ల తేడాతో ఓడింది. ఆ రోజు టీ ఆర్ ఎస్ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేసింది. అయినా కూడా కేవ‌లం ఏడు వేల తేడాతో ఓడిపోవ‌డం జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆనాడు టీడీపీ - టీజేఎస్‌ - సీపీఐ - తెలంగాణ ఇంటిపార్టీ మ‌ద్ద‌తు ఇచ్చాయి. దీంతో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గుడ్డిలో మెల్ల‌గా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ కు కేవ‌లం ఒక్క టీజేఎస్ మాత్ర‌మే సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుంది. సీపీఐ టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి - ఆర్టీసీ స‌మ్మెతో అది వెన‌క్కి త‌గ్గింది. ఇక టీడీపీ సొంతంగానే అభ్య‌ర్థిని నిలుపుకుంది. కానీ లోపాయికారిగా బీజేపీ పంచ‌న చేరే ఎత్తుగ‌డ‌లు వేస్తుంది. ఇక తెలంగాణ ఇంటిపార్టీ మ‌ద్ద‌తు ఇచ్చినా ఇవ్వ‌కున్నా దానితో పెద్ద‌గా ఒరిగేది ఏమీ లేదు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీకి పోలీసు యంత్రాంగం - ప్ర‌భుత్వ యంత్రాంగం పూర్తి స‌పోర్టు ఉంది. ఇక అంగ‌బ‌లం, ఆర్థ‌బ‌లం ఉండ‌నే ఉన్నాయి. కేసీఆర్ ఈ ఎన్నిక‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని త‌న పార్టీ శ్రేణుల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే ముందుకు న‌డిపిస్తున్నారు.

ఇక ఈ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సింది పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డే. ఈ సీటును గెలిపించుకోక పోతే ఆయ‌న పీసీసీ ప‌ద‌వికి ఎస‌రు రావ‌డం ఖాయం. అంతే కాదు ఇప్పుడు ఓడిపోతే తాను ఓడిపోయిన‌ట్లే లెక్క‌. ఎందుకంటే ఈ ఎన్నిక‌లో పోటీ చేస్తుంది ఉత్త‌మ్ భార్య ప‌ద్మావ‌తి. ఆమె ఇంత‌కు ముందే కోదాడ‌లో ఓడిపోయారు. ఇప్పుడు ఆమే ఓడిపోతే.. ఇక ఉత్త‌మ్ ప‌ని అంతే సంగ‌తులు. ఈ సీటు గెలిచినా గెల‌వ‌కున్నాకేసీఆర్‌కు పెద్ద‌గా వ‌చ్చే న‌ష్టం లేదు.. కాకుంటే కొత్త‌గా మ‌రో సీటును గెలుచుకుని, త‌మ ఖాతాలో మ‌రో సీటును పెంచుకునే అవ‌కాశం ద‌క్కుతుంది.

ఏదేమైనా ఈ ఎన్నిక ప్ర‌ధానంగా కేసీఆర్ వ‌ర్సెస్ ఉత్త‌మ్ గా మారింద‌నే చెప్ప‌వ‌చ్చు.. ఇక బీజేపీ త‌న ఓటు బ్యాంక్‌ను పెంచుకోవ‌డం త‌ప్పిదే పెద్ద‌గా ప్రభావం చూపే ప‌రిస్థితి లేదు.. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు గొప్ప‌ల‌కు పోయి అభ్య‌ర్థిని నిలిపాడు.. ఇక్క‌డ డిపాజిట్ పోయిందంటే.. చంద్ర‌బాబు ప‌రువు మ‌రోసారి పోయిన‌ట్టే. సో సోమ‌వారం రోజున ఏ పార్టీ స‌త్తా ఏమీటో ఓట‌ర్లు త‌మ స‌త్తాను చూప‌నున్నారు..