Begin typing your search above and press return to search.

బీజేపీ బ‌లోపేతం కోసం కేసీఆర్ వెయిటింగ్‌..!

By:  Tupaki Desk   |   24 March 2022 4:40 AM GMT
బీజేపీ బ‌లోపేతం కోసం కేసీఆర్ వెయిటింగ్‌..!
X
బీజేపీ బ‌లోపేతం కోసం కేసీఆర్ ఆలోచ‌న చేస్తున్నారా..? తెలంగాణ‌లో క‌మ‌లం ఎదుగుద‌ల‌ను ఆయ‌న‌ కోరుకుంటున్నారా..? కాంగ్రెస్ ను వెన‌క్కి నెట్టి ప‌రోక్షంగా ఆ పార్టీ నిల‌బ‌డాల‌ని భావిస్తున్నారా..? అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారా..? బీజేపీ - టీఆర్ఎస్ కుస్తీ ఉత్తుత్తిదేనా..? ఇదంతా మోదీ కేసీఆర్ ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌లో భాగ‌మేనా..? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు.

వ‌రి అంశంపై మ‌రోసారి ఫైర్ అయ్యారు కేసీఆర్‌. సోమ‌వారం జ‌రిగిన టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో కేంద్రం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. యాసంగి వ‌రి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. లేక‌పోతే తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో కేంద్ర ప్ర‌భుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వ‌రి కొనుగోలు కోసం పంజాబ్ రైతుల మాదిరిగానే ఉద్య‌మించాల‌ని పిలుపునిచ్చారు.

ఈ స‌మావేశంలో కేసీఆర్ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. క‌శ్మీర్ ఫైల్స్ మొద‌లు.. బోధ‌న్ లో శివాజీ విగ్ర‌హం.. చిన జీయ‌ర్ తో గ్యాప్.. ప్ర‌శాంత్ కిశోర్ క‌మిట్మెంట్.. కేంద్రంలో థ‌ర్డ్ ఫ్రంట్ వ‌ర‌కు టీఆర్ ఎస్ వైఖ‌రిపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ఇక రాబోయే రోజుల్లో మోదీతో క‌య్య‌మే త‌ప్ప వియ్యం ఉండ‌ద‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. కేంద్రం ధాన్యం కొన‌క‌పోతే తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తుంద‌ని హెచ్చ‌రించారు.

అయితే.. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మేన‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. మోదీతో కేసీఆర్ కుస్తీ తాత్కాలిక‌మేన‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత మోదీతో చెలిమి కోసం స్నేహ హ‌స్తం అందిస్తార‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న‌టి స‌మావేశంలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఉండ‌బోవ‌ని చెప్పిన అంశమే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు. ముంద‌స్తు వాయిదా బీజేపీ బ‌లోపేతానికేన‌ని సందేహిస్తున్నారు.

ఎందుకంటే.. గ‌త కొంత కాలంగా కేసీఆర్ అడుగులు ముంద‌స్తు కోణంలోనే సాగాయి. ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌, ద‌ళిత‌బంధు, బ‌డ్జెట్లో సంక్షేమ ప‌థ‌కాలకు నిధుల వ‌ర‌ద‌, రాజ‌కీయ స‌ల‌హాదారుగా ప్ర‌శాంత్ కిశోర్ నియామ‌కం.. త‌దిత‌ర సంఘ‌ట‌న‌లు ముంద‌స్తుకే వెళ‌తార‌నే అనుమానాల్ని వ్య‌క్తం చేశాయి. కాంగ్రెస్ కాలు చేయి కూడ‌దీసుకోక‌ముందే, బీజేపీ బ‌లోపేతం కాక‌ముందే, రెండు పార్టీల‌పై పెద్ద దెబ్బ వేసి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఆలోచించార‌ట‌. అయితే పీకే స‌ర్వేలో ఫ‌లితాలు నెగెటివ్ గా వ‌చ్చాయ‌ట‌. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త‌తో ఉన్న‌ట్లు గుర్తించార‌ట‌. సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న కాంగ్రెస్ రేవంత్ దూకుడుతో ఈ వ్య‌తిరేక‌త‌ను అందిపుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలో తేలింద‌ట‌.

దీంతో కేసీఆర్ ముంద‌స్తు ఆలోచ‌న‌ను మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌డంతో ఆలోపు బీజేపీ తెలంగాణ‌లో పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి టీఆర్ఎస్ లాభ‌ప‌డుతుంద‌ని అంచ‌నా వేశార‌ట‌. ఒక‌వేళ హంగ్ వ‌చ్చినా బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌ని యోచిస్తున్నార‌ట‌. అందుకే మోదీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోవాల‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. చూడాలి మ‌రి కేసీఆర్ నిర్ణ‌యాల ఫ‌లితం ఎలా ఉంటుందో..!