Begin typing your search above and press return to search.
మోడీ కలకు కేసీఆర్ మద్దతు...ఎంపీతో లేఖ
By: Tupaki Desk | 8 July 2018 11:45 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలకు ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. లోక్ సభకు - రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు సాగుతున్న మోడీకి తమ పార్టీ తరఫున మద్దతు పలికారు. జమిలీ ఎన్నికలపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ శనివారం సంప్రదింపులు ప్రారంభించింది. తొలిరోజు అధికార బీజేపీ - ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. కాగా లా కమిషన్ సంప్రదింపులకు హాజరైన పలు ప్రాంతీయ పార్టీలు ఏకకాల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికలను నిర్వహిస్తే జాతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తాయని.. చిన్న పార్టీలకు అది శరాఘాతంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశాయి. రెండో రోజు తమ పార్టీ ఎంపీ చేత కేసీఆర్ అనుకూల వాదన వినిపించారు.
రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న లా కమిషన్‌కు టీఆర్ ఎస్ పార్టీ తరఫున ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పార్టీ తరఫున లేఖ అందించిన అనంతరం వినోద్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై సీఎం కేసీఆర్ లేఖను లా కమిషన్ కు అందించాను. ``2019 నుంచి జమిలి ఎన్నికలకు టీఆర్ ఎస్ అనుకూలం. జమిలి ఎన్నికలంటే అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే మొదలైంది కాదు. జమిలి ఎన్నికలపై 1983 నుంచి జాతీయ న్యాయ కమిషన్ చర్చిస్తోంది. మోడీ ప్రభుత్వమో - బీజేపీ ఈ చర్చను ప్రారంభించలేదు. జమిలి ఎన్నికలంటే ప్రధాని నరేంద్రమోడీ తెచ్చిన కొత్త విధానం అనుకుంటున్నారు. మోడీ కంటే ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఈ విధానంతో ఐదేళ్లపాటు కేంద్ర - రాష్ర్టాల పాలన సుగమంగా సాగుతుంది` అని అన్నారు.
జమిలీ ఎన్నికలతో పూర్తికాలం పాటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని వినోద్ విశ్లేషించారు. `కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే రాష్ర్టాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుంది. మోడీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా డబ్బు, సమయం వృథా అవుతోంది. 2019లోనే తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలతో నష్టం ఉండదు. ముందస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థంలేని వాదనకు తెరలేపారు`` అంటూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన పార్టీలపై అసహనం వ్యక్తం చేశారు.