Begin typing your search above and press return to search.

ఆ విషయంలో జగన్ని వాడుకోనున్న కేసీఆర్...

By:  Tupaki Desk   |   26 Sep 2019 7:52 AM GMT
ఆ విషయంలో జగన్ని వాడుకోనున్న కేసీఆర్...
X
హుజూర్ నగర్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే... కాంగ్రెస్ కంచుకోటని బద్దలుగొట్టి తమ వశం చేసుకోవాలని టీఆర్ ఎస్ భావిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ స్థానంలో టీఆర్ ఎస్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలా అయిన గెలుచుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డినే మళ్ళీ బరిలోకి దించారు.

ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం కేటీఆర్ హుజూర్ నగర్ లో తిష్ట వేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ గెలిచేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వాడుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దివంగత వైఎస్సార్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానంలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి గట్టు శ్రీకాంత్ రెడ్డి దాదాపు 27 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ - టీఆర్ ఎస్ తర్వాత మూడో స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ కేవలం ఏపీ మీద దృష్టి పెట్టి...తెలంగాణని వదిలేశారు. అయితే ఇప్పుడు హుజూర్‌ నగర్ లో వైసీపీ బలం తెలుసుకున్న కేసీఆర్ - జగన్ మద్ధతు కోరుతున్నారు. తాజాగా జరిగిన భేటీలో కూడా కేసీఆర్ హుజూర్‌ నగర్ లో తమకు మద్ధతు ఇవ్వాలని జగన్ ని కోరినట్లు సమాచారం. అక్కడ ఉన్న వైసీపీ మద్ధతుదారులని తమకు సపోర్ట్ ఇచ్చేలా చేయాలని కోరారని తెలుస్తోంది.

కానీ దీనికి జగన్ సమాధానంగా..తెలంగాణలో తాము పోటీ చేయడం లేదు...ఇక్కడ తమకు ఓటు బ్యాంక్ ఉందంటారా? అని నవ్వి ఊరుకున్నారట. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయాన్ని వదలకుండా జగన్ సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ... నియోజకవర్గంలోని వైసీపీ మద్ధతుదారులతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే వారితో సమావేశమై ఎన్నికలో తమకే మద్ధతు ఇవ్వాలని - ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారని చెప్పేందుకు రెడీ అయ్యారట. ఈ విధంగా హుజూర్ నగర్ ఉపఎన్నికలో కేసీఆర్ - జగన్ ని వాడుకోనున్నార‌న్న‌మాట.