Begin typing your search above and press return to search.

బీజేపీపై యుద్ధం.. అటు నుంచి న‌రుక్కొస్తున్న కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:30 PM GMT
బీజేపీపై యుద్ధం.. అటు నుంచి న‌రుక్కొస్తున్న కేసీఆర్‌!
X
కేంద్రంలోని బీజేపీతో సై.. అంటే.. సై.. అంటున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు ఈ క్ర‌మంలో చేస్తున్న చ‌ర్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ద‌క్షిణాదిలో ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చే వారిని ప‌క్క‌న పెడితే.. ఉత్త‌రాదిలో మోడీని, బీజేపీని వ్య‌తిరే కించే వారితో ఆయ‌న చెలిమికి రెడీ అయ్యారు. అటు నుంచి న‌రుక్కొద్దాం! అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఉత్త‌రాది నేత‌ల‌తో కేసీఆర్ వ‌రుస భేటీలు అవుతున్నారు. బీజేపీని వ్య‌తిరేకించేవారు.. కేంద్రంలో మోడీని గ‌ద్దె దింపాల‌నుకునేవారు.. ఇలా వీరంతా ఇప్పుడు కేసీఆర్‌తో భేటీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ వ్య‌తిరేక శక్తుల‌ను ఏకం చేసే ప‌నిలో కేసీఆర్ బిజీబిజీగా గ‌డుపుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.

ఒక‌వైపు.. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని భీష్మించి.. కేసీఆర్‌ను ఇరుకున ప‌డేయ‌డంతోపాటు.. కేసీఆర్ స‌ర్కారుపై కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు కూడా యుద్ధం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఉపాధ్యాయుల‌కు సంబంధించిన జీవో 317పై పోరాటాన్ని బీజేపీ నేత‌లు తీవ్ర త‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జేపీ న‌డ్డా స‌హా అసోం సీఎం, మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎంలు వ‌రుస‌గా వ‌చ్చి.. రాష్ట్ర బీజేపీకి అండ‌గా నిలిచారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అదేస‌మ‌యంలో వరుసపెట్టి జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో కేసీఆర్‌.. మ‌రింత అలెర్ట్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీకి గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీజేపీని గ‌ద్దె దింపాలంటే.. లౌకిక శక్తులన్నీ ఏకంకావాలనే వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే బిహార్‌కు చెందిన మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు, ఆర్జేడీ నేత‌ తేజస్వీ యాదవ్‌తో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలో ఇరు వురు నాయ‌కులు.. కేంద్రంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన‌ట్టు తెలిసింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ వంటి నాయ‌కుల అవ‌స‌రం ఉంద‌ని.. ఈ సంద‌ర్భంగా లాలూ అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది.

ఇక‌, క‌మ్యూనిస్టుల‌తోనూ.. కేసీఆర్ స‌న్నిహితంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీపీఎం స‌భ‌ల్లో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. సీతారాం ఏచూరి.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని వ్య‌తిరేకించే ఏ పార్టీతో అయినా.. క‌లిసి ప‌నిచేసేందుకు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ వ్యాఖ్య‌ల వెనుక‌.. ఆయ‌న కేసీఆర్ ను ఉద్దేశించే వ్యాఖ్యానించార‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. ఇక‌, కేసీఆర్ కూడా ఎన్న‌డూ లేనిది క‌మ్యూనిస్టుల‌పైనా.. ప్రేమ‌ను కురిపిస్తున్నారు. కొన్ని రోజుల కింద‌ట త‌మిళ‌నాడు వెళ్లిన కేసీఆర్‌.. అక్క‌డ డీఎంకే అధినేత‌, సీఎం స్టాలిన్‌తో భేటీ అయి.. చ‌ర్చించారు. ఇలా వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.