Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు పై కేసీఆర్ వార్.. ఎంత భారీగా అంటే?

By:  Tupaki Desk   |   17 Nov 2021 6:30 AM GMT
మోడీ సర్కారు పై కేసీఆర్ వార్.. ఎంత భారీగా అంటే?
X
కాలి కింది ముల్లులా.. పంటి కింద రాయిలా.. కంట్లో నలుసుగా మారిన హుజూరాబాద్ ఓటమి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరాకు పుట్టిస్తోంది.

గులాబీ బాస్ మాటల్లోనే చెప్పాలంటే.. భయంకరమైన ఉద్యమకారులుగా ఉన్న వేళలో.. అరవీర భయంకరంగా ఉమ్మడి రాష్ట్రంలోని సమైక్య పాలకులతో పోరాడిన వేళలోనూ.. ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసేందుకు రాని కేసీఆర్.. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం కేంద్రంలోని మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఆయన.. ధర్నా చౌక్ వద్ద కాలు పెట్టనున్నారు.

అయితే ప్రగతి భవన్.. లేదంటే ఫామ్ హౌస్(కాదు.. కాదు.. కేసీఆర్ సారుకు కోపం వస్తుంది ఫార్మర్స్ హౌస్) కు మాత్రమే పరిమితమవుతారంటూ విపక్షాలు విరుచుకుపడే వేళ.. అందుకు భిన్నంగా ధర్నా చౌక్ లో ధర్నా చేసేందుకు తానే స్వయంగా వస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో ధర్నా చేయించిన గులాబీ బాస్ తాజాగా మాత్రం తానే స్వయంగా మహాధర్నాలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు రాష్ట్రంలోని బీజేపీ నేతల్ని వెంటాడుతూనే ఉంటామన్న ఆయన.. మోడీ సర్కారుకు సైతం అల్టిమేటం జారీ చేశారు. ఈ రోజు (బుధవారం) ఉదయం ప్రధాని మోడీకి లేఖ రాస్తామని.. రేపు (నవంబరు 18న) మహాధర్నా చేపడతామని ప్రకటించారు.

ఈ ధర్నాకు తాను స్వయంగా హాజరవుతామన్న కేసీఆర్.. తనతో పాటు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. జెడ్పీ.. కో -ఆ పరేటివ్ బ్యాంకులు.. డీసీఎంస్ ఛైర్మన్లు అందరూ ధర్నాలో పాల్గొంటారన్నారు. ఇందిరా పార్కు వద్ద ఉదయం పదకొండు గంటలకు ధర్నా మొదలు పెట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నాలో పాల్గొంటామన్నారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు వేచి చూస్తామని..అప్పటికి కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే.. బీజేపీని వెంటాడుతూనే ఉంటామన్నారు.

‘‘విడిచిపెట్టం. మేం ఉద్యమకారులం. భయంకరమైన ఉద్యమాలు చేసి.. తెలంగాణను సాధించినం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఎంతకైనా తెగిస్తాం. వెనక్కి వెళ్లిపోయే ప్రశ్నే ఉండదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరో విధంగా స్పందిస్తున్నారు. రైతులను అనవసరమైన గందరగోళంలో పడేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

యాసంగిలో వరి వేయాలని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదే మాట మీద నిలబడతాడా? ధాన్యం కొనిపిస్తాడా? లేక తప్పు చెప్పిన అని ప్రజలకు క్షమాపణ చెబుతాడా? తేల్చుకోవాలన్నారు. ఇప్పటివరకు మాటల్లో మాత్రమే చూపించే ఆగ్రహం.. ఈసారి అందుకు భిన్నంగా చేతల్లో చూపించేందుకు సిద్ధం కావటం.. తానే స్వయంగా రంగంలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. మరి.. కేసీఆర్ చేస్తున్న ఈ పోరాటానికి కేంద్రంలోని మోడీ సర్కరు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.