Begin typing your search above and press return to search.

పిచ్చుకపై బ్రహాస్త్రమా కేసీఆర్

By:  Tupaki Desk   |   13 July 2015 10:54 PM GMT
పిచ్చుకపై బ్రహాస్త్రమా కేసీఆర్
X
పారిశుద్ధ్య కార్మికులు విషయంలో తెలంగాణ సర్కారు తీవ్ర చర్యలకు సమాయుత్తమవుతోంది. గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు.. మంగళవారం నుంచి విధులకు హాజరు కాకపోతే.. ఆర్మీని.. పోలీసుల్ని.. ఇతర ఉద్యోగుల్ని రంగంలోకి దించుతామని.. కొత్తగా కార్మికుల్ని నియమిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసే ఉద్యోగుల విషయంలో ఇంత కఠిన వైఖరిని అనుసరించని తెలంగాణ సర్కారు.. తమ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఏమిటని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సైన్యాన్ని.. పోలీసుల్ని రంగంలోకి దించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమ సందర్భంగా.. దాన్ని అణిచి వేసేందుకు నాటి సర్కారు ఆర్మీని.. పోలీసుల్ని వినియోగించిందని.. ఆ సందర్భంగా ఉద్యమం మరింత పెరిగిందే తప్పించి.. తగ్గలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అయినా.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ల పరిష్కార విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని.. తాను అనుకున్నదే జరగాలన్న భావన తప్పించి.. కార్మికుల కోణం నుంచి అస్సలు ఆలోచించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. నిజానికి పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరిస్తే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. కార్మిక సంఘాల్ని నియంత్రించే ఉద్దేశ్యంతోనే తెలంగాణ సర్కారు కార్మికుల సమ్మెను రాజకీయ కోణంలో చూస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా వ్యవహరించే కన్నా.. తాను చెప్పింది వినరా అన్న కర్రపెత్తనమే తెలంగాణ సర్కారు వైఖరిలో కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.