Begin typing your search above and press return to search.

ఏ ఒక్కరినీ వ‌ద‌లం.. కేసీఆర్ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   15 Aug 2017 10:18 AM GMT
ఏ ఒక్కరినీ వ‌ద‌లం.. కేసీఆర్ వార్నింగ్‌!
X
టాలీవుడ్‌ను `సిట్` వ‌ద‌ల‌డం లేదు. డ్ర‌గ్స్ కుంభకోణం టాలీవుడ్‌ను అత‌లాకుతలం చేస్తోంది. ఇందులో టాలీవుడ్ ద‌ర్శ‌కులు, న‌టులు కూడా ఉన్నార‌నే న్యూస్ బ‌య‌ట‌కు రావ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు! సుమారు 12 మంది సినీ ప్ర‌ముఖుల‌తో పాటు పలువురు అనుమానితులపైనా సిట్ అధికారులు దృష్టి సారించి విచారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొంద‌రి గోళ్లు, వెంట్రుక‌లు, ఇత‌ర న‌మూనాలు తీసుకున్నారు. ఈ విష‌యంలో వెన‌క‌డుగు వేసేది లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. స్వాతంత్య్ర‌దినోత్స‌వ వేడుక‌ల్లో ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. ఇందులో ఉన్న ఏ ఒక్క‌రినీ వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రించారు.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే సుమారు 12 మందిని విచారించిన ఈ బృందం.. రెండో విడ‌త కార్యాచ‌ర‌ణ‌ను రూపొంది స్తోంది. ఇందులో భాగంగా కొంత‌మంది అరెస్టుల‌కు కూడా రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్ద‌రు సినీ ప్ర‌ముఖులు సిట్ వ‌ల‌లో చిక్కిన‌ట్టేననే స‌మాచారం. తొలి విడ‌త‌లో సేక‌రించిన స‌మాచారం, వీడియో ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించిన అధికారులు తదుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. తమ విచారణలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు చాలానే పేర్లు చెప్పినా.. ఇద్దరి ప్రస్తావన మాత్రం ఒకేలా వచ్చిందట‌.

కాగా, గోల్కొండ కోట వేదికగా జరిగిన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ మ‌రోసారి డ్ర‌గ్స్ అంశాన్ని ప్ర‌స్తావించారు. తెలంగాణలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఏ ఒక్క ప్రముఖుడినీ వదిలేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తానని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా మత్తుమందుల వాడకంలో నేరం నిరూపితమైతే చట్టం ముందు ఒకటేనని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి ఎకరా పొలానికీ నీరివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఆయ‌న అన్నారు. అన్ని చెరువులనూ పునరుద్ధరిస్తామన్నారు. ఇటీవలే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్ వైభవాన్ని కల్పించేందుకు పనులు ప్రారంభించామని గుర్తు చేసిన కేసీఆర్ - వచ్చే సంవత్సరం నుంచి రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామ‌ని, ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతుకు అందిస్తామని తెలిపారు.