Begin typing your search above and press return to search.

పిల్లి మెడ‌లో ‘ఘంట’ క‌ట్టేదెవ‌రు ?

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:32 AM GMT
పిల్లి మెడ‌లో ‘ఘంట’ క‌ట్టేదెవ‌రు ?
X
తెలంగాణ ఉద్య‌మంలో మేధావిగా, జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన ప్ర‌స్తుత తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ చైర్మ‌న్ ఘంటా చ‌క్ర‌పాణికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంచి అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న‌తో పాటు ముక్కుసూటి మ‌నిషిగా - ద‌ళిత స‌మాజంలో నిజాయితీ గ‌ల మ‌నిషిగా పేరుప‌డ్డ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ను తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్ సొసైటీల‌కు చైర్మ‌న్ గా నియ‌మించి సంపూర్ణ అధికారాల‌ను క‌ట్ట‌బెట్టారు.

ఇలాంటి మేధావులు ప్ర‌భుత్వానికి దూరంగా ఉంటే ప్ర‌తిప‌క్షాల మాయ‌లో ప‌డి తెలంగాణ స‌మాజానికి ప్ర‌భుత్వ చిత్త‌శుద్ది మీద వ్య‌తిరేక సంకేతాలు పంపుతార‌ని - వారికి మంచి అవ‌కాశాలు ఇచ్చి తెలంగాణ యువ‌త‌కు - తెలంగాణ‌లోని ఎదుగుతున్న త‌రాల‌కోసం ప‌నిచేసే అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్దేశం. కానీ కేసీఆర్ ఆశించిన దానికి వీరు ప‌నిచేస్తున్న విధానానికి ఏ మాత్రం పొంత‌న లేద‌ని తెలుస్తుంది.

టీఎస్ పీఎస్సీ చైర్మ‌న్ గా ప‌నిచేస్తున్న ఘంటా చ‌క్ర‌పాణి వ్య‌క్తిగ‌త ప్ర‌చార ఆర్భాటంలో ప‌డి నోటిఫికేష‌న్ల విడుద‌ల‌లో ఉన్న త‌ప్పు ఒప్పుల‌ను స‌రిగ్గా ప‌రిశీలించ‌కుండా విడుద‌ల చేసి కోర్టు కేసుల‌లో ఇరుక్కునేలా చేస్తున్నారు. త‌ద్వారా ప్ర‌భుత్వాన్ని నిరుద్యోగుల ముందు దోషిగా నిల‌బెడుతున్నారు. ఆ మ‌ధ్య గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల‌కు సంబంధించి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పంప‌డం, దానిని గుడ్డిగా ఘంటా చ‌క్ర‌పాణి విడుద‌ల చేయ‌డం జ‌రిగింది.

రాష్ట్ర‌, దేశ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా గురుకుల ఉద్యోగాల‌లో మ‌హిళ‌ల‌కు దాదాపు 70 శాతం మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు ఇంత గొప్ప నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేట‌ప్పుడు న్యాయ‌నిపుణులు - సీనియ‌ర్ల స‌ల‌హాలు తీసుకోకుండా ముందుకెళ్ల‌డంతో నోటిఫికేష‌న్ ఆగిపోయింది. ఈ నోటిఫికేష‌న్ తో ప్ర‌భుత్వానికి మంచిపేరు రావాల్సింది పోయి చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంది. ఘంటా, ప్ర‌వీణ్ కుమార్ లు విడుద‌ల చేసిన ఈ నోటిఫికేష‌న్ వారి సామాజిక వ‌ర్గం అయిన ద‌ళితుల‌కె అన్యాయం చేసేదిగా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీఎస్ పీఎస్సీలో ప‌లు నోటిఫికేష‌న్ల ప‌రిస్థితి ఇదే. స‌ర‌యిన క‌స‌ర‌త్తు లేకుండా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసి ప్ర‌భుత్వాన్ని బ‌ద్ నాం చేస్తున్నార‌ని వాద‌న వినిపిస్తోంది.

టీఎస్ పీఎస్సీ చైర్మ‌న్ అంటే ప్ర‌చారానికి దూరంగా ఉండాలి. దేశంలో ఏ రాష్ట్ర చైర్మ‌న్ అయినా అంతే. కానీ ప్రచార యావ‌తో ఘంటా ర‌గిలిపోతున్నార‌ని అంటున్నారు. ఇక సాంఘీక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల పూర్వ‌పు విద్యార్థుల‌తో స్వేరో సంస్థ‌ను ఏర్పాటు చేసిన గురుకుల పాఠ‌శాల‌ల కార్య‌ద‌ర్శి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాష్ట్రంలో త‌న సొంత ఎజెండాను అమ‌లు చేస్తున్నారు. గురుకుల పాఠశాల‌లో ఇప్పుడు స్వేరో విద్యార్థుల‌దే హ‌వా. తాము చెప్పిన‌ట్లు విన‌కుంటే గురుకుల పాఠ‌శాల‌ల ప్ర‌ధాన ఉపాధ్యాయుల‌ను బెదిరించ‌డం .. నేరుగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కు మెసేజ్ లు పెట్టి వేధించ‌డం జ‌రుగుతుంది. దీంతో స్వేరోల పేరు చెబితేనే గురుకుల పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు వ‌ణికిపోతున్నారు.

నోటిఫికేష‌న్లు నిలిచిపోవ‌డం - ప్ర‌భుత్వానికి నిరుద్యోగుల‌లో ఇటీవ‌ల చెడ్డ‌పేరు రావ‌డాన్ని చూసి వీరిద్ద‌రిని పిలిచిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌లంటార‌ని స‌మాచారం. తెలంగాణ‌కు ఏదో మేలు చేస్తార‌ని మిమ్మ‌ల్ని న‌మ్ముకుని నేనుంటే .. నా సీటు కింద‌కే నీళ్లు తీసుకువ‌స్తున్నార‌ని, నేను ఏమ‌రుపాటుగా ఉన్నాన‌ని మీరు తోక జాడిస్తే .. ఎక్క‌డ క‌ట్ చేయాలో నాకు తెలుస‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌భుత్వప‌రంగా అన్ని ర‌కాల స‌హ‌కారాలు ఇస్తున్నాం .. గ‌త ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా ఉద్యోగాలు వేస్తున్నాం .. కానీ మీ నిర్ల‌క్ష్యం మూలంగా అభాసు పాల‌వుతున్నాం అని కేసీఆర్ అన్న‌ట్లు తెలుస్తుంది. దీంతో గ‌తుక్కుమ‌న్న వీరు స‌ర్దుకుని త‌రువాత మీడియాలో వివ‌ర‌ణ‌లు ఇచ్చుకున్నారు. మ‌రి వీరిలో మార్పు వ‌స్తుందా ? లేక కేసీఆర్ వీరికి త్వ‌ర‌లోనే చెక్ పెడ‌తారా ? వేచిచూడాలి.