Begin typing your search above and press return to search.

ఆర్మీని దించే పరిస్థితి - కనిపిస్తే కాల్చివేసే పరిస్థితి తెచ్చుకోవద్దు:కేసీఆర్

By:  Tupaki Desk   |   24 March 2020 3:49 PM GMT
ఆర్మీని దించే పరిస్థితి - కనిపిస్తే కాల్చివేసే పరిస్థితి తెచ్చుకోవద్దు:కేసీఆర్
X
తెలంగాణలో ఇప్పటి వరకు 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందులో ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని - మరో 114 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించారని - తెలంగాణలోను ఆర్మీని రంగంలోకి దింపడం - 24 గంటల కర్ఫ్యూ - కనిపిస్తే కాల్చివేత లాంటి ఉత్తర్వులు అవసరమా అన్నారు. అలాంటి పరిస్థితిని తీసుకు రావొద్దని చెప్పారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఇప్పుడున్న కేసులు 7వ తేదీ వరకు క్యూర్ అవుతాయని - అప్పటి లోగా అందరికీ తగ్గుతుందన్నారు. కాబట్టి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రపంచంలో 190 దేశాలకు ఈ మహమ్మారి సోకిందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని కోరారు. కవులు అందరు మంచి కవితలు రాసి - ప్రజలను ఇళ్లలోకి బయటకు రాకుండా ప్రోత్సహించాలన్నారు. కరోనా అవగాహన కోసం అధికారులు - ప్రజాప్రతినిధులు మాత్రమే కనిపించాలన్నారు.

జీహెచ్ ఎంసీ పరిధిలో 150 మంది కార్పోరేటర్లు ఎక్కడకు వెళ్లారని - వారు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పారు. మంత్రులు జిల్లా కేంద్రాల్లో - ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాలన్నారు. వైద్య - వ్యవసాయ - మున్సిపల్ మంత్రులు మాత్రమే హైదరాబాదులో ఉండాలన్నారు. గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీ సభ్యులు యాక్టివ్ కావాలన్నారు. ప్రజలతో ప్రత్యేకంగా సంబంధాలు ఉన్న నేతలు రోడ్లు ఎక్కాలన్నారు. లక్షలమంది ప్రజాప్రతినిధులు రోడ్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

రాష్ట్ర సరిహద్దుల్లో 3వేల వాహనాలు ఉన్నాయని - ఈ రోజు ఒక్కరోజే వాటిని తెరిచి ఉంచుతామని - రేపటి నుండి అవి క్లోజ్ అవుతాయని చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఎలాంటి అత్యవసర సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేయాలన్నారు. రైతుల మొక్కజొన్న - వరి పంటను ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని - ఎవరు కూడా నగర మార్కెట్లకు రావొద్దని సూచించారు. మద్దతు ధర చెక్స్ ద్వారా నిధులు ఇస్తామని చెప్పారు. రైతు బంధు సమితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయన్నారు.

హోమ్ క్వారంటైన్‌ లో ఉన్నవారి పాస్ పోర్టులను సీజ్ చేయాలన్నారు. నియంత్రణతో ఇళ్లలోనే ఉండాలన్నారు. కూరగాయలు - నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నట్లు తాను విన్నానని ఆగ్రహించారు. ఏడాదికి మన రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయని - ఎవరైనా అధికంగా కూరగాయల ధరలు పెంచితే పీడీ యాక్ట్ పెడతామన్నారు. ధరలు అధికంగా పెంచితే బ్లాక్ లిస్టులో పెడతామని - మళ్లీ లైఫ్‌ లో దుకాణం ఉండదని హెచ్చరించారు.

అమెరికా వంటి అగ్రదేశంలోనే కఠిన చర్యలు తీసుకుంటున్నారని - దేశంలో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారన్నారు. మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయని - కాబట్టి ఆ పోలీస్ సిబ్బంది రెగ్యులర్ డ్యూటీ చేస్తారన్నారు. ప్రజలు కంట్రోల్‌ లో లేకుంటే పెట్రోల్ పంపులు బంద్ చేస్తామన్నారు. కరోనా కారణంగా బంద్‌‌ తో ఎకనామిక్‌ గా రాష్ట్రానికి నష్టమని - కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని - ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలన్నారు.

పోలీసులు కొంతమంది జర్నలిస్టులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసిందని, వారికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రజలకు పోవాలంటే మీడియాకు స్వేచ్చ ఉండాలన్నారు. మీడియా పట్ల ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించకూడదన్నారు. రష్యా కరోనాను జయించిందని - బయటకు వస్తే అయిదేళ్లపాటు జైళ్లో వేస్తామని అక్కడ హెచ్చరించారన్నారు.

వైద్య శాఖ ఆదేశాలు అన్ని శాఖలు పాటించాలన్నారు. ఎల్లుండి నుండి బియ్యం ఇస్తామని - నిధులు అకౌంట్‌ లో వేస్తామని చెప్పారు. సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని - ఇవాళ్టి నుండి అమలు చేస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు కట్టి వేయాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పనులను ప్రభుత్వం అమలు చేస్తుందని - ఉపాధి హామీ పథకం - ప్రాజెక్టుల పనులు కొనసాగుతాయన్నారు. ఊళ్లలో కరోనా ప్రభావం పెద్దగా లేదు కాబట్టి - రైతులు పొలం పనులు చేసుకోవచ్చునని - కానీ గుంపులుగా ఉండకూడదన్నారు. గ్రామీణ - పట్టణ ప్రాంతాలు కంట్రోల్‌ లోనే ఉన్నాయని - కానీ హైదరాబాద్ - సైబరాబాద్ - రాచకొండ ప్రజలు సహకరించాలని కోరారు. నేటి రాత్రి నుండి అంతర్రాష్ట్ర విమాన సర్వీసులు కూడా రద్దవుతున్నాయన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువగా లేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని - మూడు కిలో మీటర్ల పరిధిలోనే కూరగాయలు - నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. ఆరోగ్య శాఖకు ఎట్టి పరిస్థితుల్లోను నిధుల కొరత ఉండదన్నారు. అవసరమైతే మిగతా శాఖలకు ఆపివేసి వైద్య ఆరోగ్య శాఖ - పోలీసు శాఖలకు ఇస్తామన్నారు.