Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఉదాహ‌ర‌ణ చెప్పి మ‌రీ వార్నింగ్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   13 Aug 2015 9:01 AM GMT
ఎన్టీఆర్ ఉదాహ‌ర‌ణ చెప్పి మ‌రీ వార్నింగ్ ఇచ్చారు
X
రాజ‌కీయం రంగు మారిపోయింది. అజెండాల గురించి మాట్లాడే క‌న్నా.. న‌మ్మిన జెండా గురించి మాట్లాడేవారే ఎక్కువైపోయారు. దీని వ‌ల్ల జ‌రుగుతున్న‌న‌ష్టం ఏమిటంటే.. ఒక‌రిలో ఉన్న మంచిని అవ‌త‌లి వారు గ్ర‌హించే ప‌రిస్థితి లేక‌పోవ‌టం. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులైన వారిలోని మంచిని స్వీక‌రించేందుకు.. ఆ విష‌యాన్ని చెప్పేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి ఇప్పుడు నెల‌కొని ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హారాన్నే తీసుకుందాం. ఆయ‌న్ని అభిమానించే వారు ఆయ‌న్ను ఎంత‌లా అభిమానిస్తారో.. ఆయ‌న్ని ద్వేషించే వారు అదే తీవ్ర‌త‌తో మండిప‌డుతుంటారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య దూరం కొల‌వ‌లేనంత ఎక్కువ‌. కేసీఆర్ లో మంచి గురించి ప్ర‌స్తావిస్తే.. అస‌లు కేసీఆర్‌లో మంచి అనే కోణం కూడా ఉందా? అని ప్ర‌శ్నిస్తుంటారు. ఇక‌.. ఆయ‌న్ని ఆరాధించే వారి ద‌గ్గ‌ర‌.. కేసీఆర్ ను విమ‌ర్శిస్తే.. అస్స‌లు ఒప్పుకోరు.

కానీ.. పోత‌పోసిన‌ట్లుగా మూర్తీభ‌వించిన మంచిత‌నం ఎవ‌రి ద‌గ్గ‌రా ఉండ‌దు క‌దా? బ‌లాలు.. బ‌ల‌హీన‌త‌లు ప్ర‌తిఒక్క‌రికి మామూలే. కేసీఆర్ లోపాలు గురించి కాస్త ప‌క్క‌న పెట్టి.. ఆయ‌నలోని ఒక గుణం గురించి ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘ‌ట‌న ఈ విష‌యాన్ని నొక్కి చెబుతుంది.

త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఎలాంటి మైండ్ సెట్ లో ఉండాల‌న్న విష‌యాన్ని చిన్న‌సైజు క్లాస్ పీకారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నో ఉదాహ‌ర‌ణ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంత‌టి నాయ‌కుడ్ని బ్ర‌హ్మాండంగా ఆద‌రించిన ప్ర‌జ‌లు.. ఆయ‌న్ని ఓడించిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన త‌ప్పుల‌తో త‌ర్వాత ఆయ‌న్ను ఓడించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

అందుకే మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌భుత్వం మీద స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని.. ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకొని మెల‌గాలంటూ త‌న పార్టీ నేత‌ల‌కు హిత‌బోధ చేశారు. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా వ‌చ్చేఎన్నిక‌ల్లో తేడా వ‌చ్చే ప్ర‌మాదాన్ని ప్ర‌స్తావించి హెచ్చ‌రించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు అంతులేని ఆత్మ‌విశ్వాసంతో వ్య‌వ‌హ‌రించ‌కుండా.. త‌న పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ క‌ళ్లాలు వేసే వైఖ‌రి ఎంద‌రికో పాఠమ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.