Begin typing your search above and press return to search.

తొలిసారి సొంత డబ్బుల్ని బయటకు తీసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   20 Oct 2021 2:39 AM GMT
తొలిసారి సొంత డబ్బుల్ని బయటకు తీసిన కేసీఆర్
X
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. సొంతంగా మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకునేందుకు సొంత డబ్బుల్ని వినియోగించటం చూస్తుంటాం. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. ఉద్యమ వేళ తాను మొక్కిన మొక్కుల్ని.. తన జేబు నుంచి కాకుండా ప్రభుత్వ బొక్కసం నుంచి ఖర్చుచేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ.. ఆయన మాత్రం తన జేబులో నుంచి రూపాయి కూడా బయటకు తీసేందుకు ఇష్టపడని వైనం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం లాంటి అసాధ్యమనుకునే కోరిక తీరితే.. తాను మొక్కలు చెల్లిస్తానంటూ పలువురు దేవుళ్లకు కేసీఆర్ మొక్కుకోవటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ఆయన తాను మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకునేందుకు ప్రజల సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఆ మాటకు వస్తే.. తన సొంత డబ్బుల్ని ఫలానా కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నట్లు ఆయన నోటి నుంచి వినటం చాలా తక్కువగా వినిపిస్తుందనే చెప్పాలి.అలాంటి కేసీఆర్ తాజాగా తన యాదాద్రి పర్యటనలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.

యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని తాము నిర్ణయించినట్లు వెల్లడించిన కేసీఆర్.. అందుకు దాదాపు 125 కేజీల బంగారం అవసరమని వెల్లడించారు. ఈ బంగారాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయటం పెద్ద విషయం కాదని.. కాకుంటే.. అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కోసం తమ కుటుంబం తరఫున ఒక కేజీ పదహారు తులాల బంగారాన్నిఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇలా కుటుంబం తరఫున విరాళాన్ని ప్రకటించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక కేజీ బంగారం అంటే దాదాపు రూ.60లక్షలు (కుడి ఎడమగా) అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను మొక్కిన మొక్కులకు సైతం ప్రభుత్వ ఖజానా నుంచి మొక్కులు తీర్చుకున్న కేసీఆర్. .యాదాద్రి ఆలయ విమాన గోపురానికి మాత్రం తమ కుటుంబం తరఫున విరాళాన్ని ప్రకటించటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.