Begin typing your search above and press return to search.

KCR: ప్ర‌ధానికి నో.. రాష్ట్రప‌తికి వెల్క‌మ్‌

By:  Tupaki Desk   |   14 Feb 2022 1:30 PM GMT
KCR: ప్ర‌ధానికి నో.. రాష్ట్రప‌తికి వెల్క‌మ్‌
X
కేంద్రంలోని బీజేపీపై పోరు బావుటా ఎగ‌రేసిన కేసీఆర్‌.. త‌న చ‌ర్య‌ల‌తో మోడీపై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రి కొనుగోళ్ల విష‌యం మొద‌లు.. ప్ర‌తి అవ‌కాశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటూ కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణ ప్ర‌స్తావ‌న లేకపోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోయిన కేసీఆర్‌.. మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక్రిశాట్ స్వ‌ర్నోత్స‌వాల్లో పాల్గొన‌డంతో పాటు రామానుజాచార్యుల విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కోసం హైదరాబాద్‌కు ప్ర‌ధాని మోడీ వ‌చ్చారు. అయితే ఆయ‌న‌కు కేసీఆర్ స్వాగతం ప‌లుకుతార‌ని మొద‌ట సీఎంవో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కానీ త‌ర్వాతి రోజు జ్వ‌రం కార‌ణంగా ప్ర‌ధాని కార్య‌క్ర‌మంలో కేసీఆర్ పాల్గొన‌డం లేద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో కేసీఆర్ కావాల‌నే దూరంగా ఉన్నార‌ని బీజేపీ వ‌ర్గాలు ఆరోపించాయి. ప్ర‌ధానిని ఆయ‌న అవ‌మానించార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. కేంద్రం వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న‌ట్లు పోరు మార‌డంతో ప్ర‌జ‌లు కూడా కేసీఆర్ కావాల‌నే మోడీకి స్వాగ‌తం ప‌ల‌క‌లేద‌ని అనుకున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ హైద‌రాబాద్‌కు వ‌స్తే మాత్రం కేసీఆర్ వెళ్లి స్వాగ‌తం ప‌లికారు. దీంతో కేసీఆర్ కావాల‌నే మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు రాలేద‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరింది. కానీ సాయంత్రం విలేక‌ర్ల స‌మావేశంలో దీనిపై స్పందించిన కేసీఆర్ క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ కుటుంబంలో ఇద్ద‌రికి క‌రోనా రావ‌డం వ‌ల్ల తాను ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌లేక‌పోయాన‌ని కేసీఆర్ చెప్పారు.

పైగా రాజ‌కీయ విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ ప్రొటోకాల్ మాత్రం పాటిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో మోడీ ప‌ర్య‌ట‌న‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో కేసీఆర్‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఇలా స‌మాధానం చెప్పార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు యాదాద్రి ఆల‌య పునఃప్రారంభం కోసం ఎవ‌రిని పిల‌వాల‌నేదానిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేసీఆర్ చెప్పారు.

మ‌రి గ‌తంలో ఈ కార్య‌క్ర‌మం కోసం రావాల‌ని మోడీని కేసీఆర్ కోరారు. కానీ ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మోడీని కేసీఆర్ అధికారికంగా ఆహ్వానిస్తారా? దానికి మోడీ అంగీక‌రిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.