Begin typing your search above and press return to search.

కేసీఆర్ కళే వేరప్పా.. తమిళిసై హ్యాపీ

By:  Tupaki Desk   |   8 Sep 2019 5:04 AM GMT
కేసీఆర్ కళే వేరప్పా.. తమిళిసై హ్యాపీ
X
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అంటాడు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఎంఎస్ నారాయణ. తెలంగాణలో ఏకచత్రాధిపత్యంతో పాలిస్తున్న కేసీఆర్ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీషాలనే ఎదురించే లెవల్లో మొండిగా ఉంటున్నారు. మోడీషాల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లకు హాజరు కాకుండా తన పంతం నెగ్గించుకున్నారు. కేసీఆర్ తీరుపై బీజేపీ గుర్రుగా ఉంది. అందుకే కొరకరాని కొయ్యలాంటి తమిళిసై సౌందర్య రాజన్ అనే లేడీ టైగర్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించారన్న చర్చ సాగింది.

అయితే అంతటి గండరగండర లాంటి లేడీ టైగర్ ను కూడా కేసీఆర్ తన చేష్టలతో కూల్ చేయడం విశేషం. ఆదివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణస్వీకారం కోసం హైదరాబాద్ శంషాబాద్ లో దిగిన తమిళిసై సౌందర్యరాజన్ కు జన్మలో మరిచిపోని అపూర్వ స్వాగతం పలికారు కేసీఆర్.. శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో బేగంపేటకు తీసుకొచ్చి ఆమెకు రెడ్ కార్పెట్ పరిచి ఏకంగా సీఎం కేసీఆర్, మంత్రులంతా, పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ లు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఆమెను పూలతో అలంకరించిన జీపులో నిలుచోబెట్టి పోలీసుల గౌరవవందనం స్వీకరింపచేశారు. ఈ అపూర్వ స్వాగతానికి ఉబ్బితబ్బిబైన తమిళిసై కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపడం విశేషం.

ఇలా పగవాడినైనా తన చర్యలతో ఆకట్టుకోగల నేర్పు కేసీఆర్ సొంతం. బీజేపీ పగబట్టి తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా నియమించిదన్న చర్చ సాగినా... ఆమె ముక్కుసూటి మనిషి అని తెలిసినా దేశ రాష్ట్రపతి, ప్రధానులకు మాత్రమే ఎదురెళ్లే కేసీఆర్ తమిళ సై కోసం స్వయంగా రావడం.. తొలి స్వాగతం లోనే అపూర్వ స్వాగతం పలికిన తీరు ఆకట్టుకుంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టే కేసీఆర్ వ్యూహాత్మకంగా గవర్నర్ కు అపూర్వ స్వాగత సత్కరాలు ఏర్పాటు చేసి ఇంప్రెస్ చేశారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది.