Begin typing your search above and press return to search.

అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వస్తారా?

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:30 PM GMT
అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వస్తారా?
X
ఏపీలో ఎక్కడకు వెళ్లినా ఇప్పుడు ఒకటే చర్చ... రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు... దసరా రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ రానుండడం.... వందలాది మంది వీఐపీలు వస్తుండడం... లక్షమందితో కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించనుండడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. పనిలో పనిగా ఇప్పుడు ఇంకో చర్చ కూడా జరుగుతోంది. శంకుస్థాపన కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంద్రబాబు ఆహ్వానిస్తుండడంతో ఆ కోటాలో కేసీఆర్ కూడా ఉంటారు కాబట్టి ఆయన హాజరవుతారా లేదా అని జనం చర్చించుకుంటున్నారు.

అసలు కేసీఆర్ ను చంద్రబాబు పిలుస్తారా లేదా..... పిలిస్తే కేసీఆర్ వస్తారా రారా... అన్నది తెలియాలి. కొద్దికాలంగా కేసీఆర్, చంద్రబాబులు ఎదురెదురు పడడం లేదు. రాష్ట్రపతి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన విందులు, ఇతర కార్యక్రమాలకు ఇద్దరు సీఎంలకు ఆహ్వానాలు అందినా ఎవరో ఒకరు గైర్హాజరు కావడమో... వేర్వేరు సమయాల్లో రావడమో చేస్తూ ముఖాముఖి ఎదురుపడకుండా తప్పించుకున్నారు. ఓటుకు నోటు, ట్యాపింగ్ కేసులతో ఇద్దరు సీఎంల మధ్య సంబంధాలు వ్యక్తిగత కక్షల్లా మారాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలుసుకోవడం లేదు. కానీ, ఇప్పుడు చరిత్రాత్మక కార్యక్రమానికి అందరినీ పిలిచి పొరుగు రాష్ట్రం సీఎంను ఆహ్వానించకుండా ఉండలేరు చంద్రబాబు.

అయితే... కేసీఆర్ కూడా ఏ మొఖం పెట్టుకుని ఆంధ్రకు వెళ్తానని అనుకోవచ్చు. చంద్రబాబు కూడా తాను స్వయంగా వెళ్లి కేసీఆర్ ను పిలిచే అవకాశం కనిపించడం లేదు... మంత్రుల్లో ఎవరో ఒకరిని పంపించే సూచనలున్నాయి... దాన్నిబట్టి కేసీఆర్ కూడా అలాంటి పిలుపుకు అలాగే స్పందిస్తారని..... తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో లేదంటే ఎవరైనా మంత్రినో పంపించొచ్చని సమాచారం.

కాగా ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాల కమిటీల్లో ఒకటైన ఆహ్వాన కమిటీ ఇప్పటికే అందరు సీఎంల పేరుతో ఆహ్వానాలు సిద్ధం చేసింది. అందులో కేసీఆర్ పేరిటా ఆహ్వానం ఉంది. దాంతో కేసీఆర్ ఆహ్వానిస్తారన్న విషయం ఖరారైంది. కానీ... గవర్నరును స్వయంగా ఆహ్వానించబోతున్న చంద్రబాబు పనిలోపనిగా హైదరాబాదులోనే ఉండే కేసీఆర్ ను కూడా తానే కలుస్తారా... లేదంటే ఆహ్వాన కమిటీ ఛైర్మన్ గా ఉండే మంత్రిని పంపిస్తారా అన్నది తేలాలి.