Begin typing your search above and press return to search.

అసెంబ్లీని ర‌ద్దు చేసినా.. సీఎం కేసీఆరే!

By:  Tupaki Desk   |   1 Sep 2018 5:24 AM GMT
అసెంబ్లీని ర‌ద్దు చేసినా.. సీఎం కేసీఆరే!
X
అసెంబ్లీని ర‌ద్దు చేయ‌మ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోర‌నున్న‌ట్లుగా ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. అందులో భాగంగా అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని కోర‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. అసెంబ్లీని రద్దు చేసిన త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? రాష్ట్రప‌తి పాల‌న వ‌స్తుందా? కేసీఆర్ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉంటారా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే..

అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు ప్ర‌ముఖ సుప్రీంకోర్టు న్యాయ‌వాది క‌ర్ణాట‌క మాజీ గ‌వ‌ర్న‌ర్ హెచ్ ఆర్ భ‌ర‌ద్వాజ్ మాజీ స‌ల‌హాదారు వికాస్ బ‌న్సోడే.

కేసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. అసెంబ్లీ ర‌ద్దుకు సిఫార్సు చేస్తే.. ఆ నిర్ణ‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ ఆమోదిస్తార‌ని.. కేసీఆర్ ను ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌మ‌ని కోరుతార‌ని చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ పార్టీ నాయ‌కుడిగా ఎన్నికై సీఎంగా ప్ర‌మాణం చేసిన కేసీఆర్ కు రాజ్యాంగం ప్ర‌కారం ఎప్పుడైనా అసెంబ్లీని ర‌ద్దు చేసి.. ప్ర‌జ‌ల తీర్పు కోరే హ‌క్కు ఉంటుంద‌న్నారు.

గ‌తంలో ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన వాజ్ పేయ్.. ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు.. మోడీ.. భూపేంద‌ర్ సింగ్ హుడాలు కూడా ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించిన విష‌యాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్ల‌టం స‌రైన నిర్ణ‌య‌మా? కాదా? అన్న విష‌యాన్ని తేల్చేది ప్ర‌జ‌లేన‌ని వ్యాఖ్యానించారు. సో.. అసెంబ్లీని ర‌ద్దు చేసినా.. సీఎంగా మాత్రం కేసీఆరే వ్య‌వ‌హ‌రిస్తారు. కాకుంటే ప‌రిమిత‌మైన అధికారాల‌తోనే సుమా!