Begin typing your search above and press return to search.

ఆత్మకథ రాసుకుంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Feb 2017 6:51 AM GMT
ఆత్మకథ రాసుకుంటున్న కేసీఆర్
X
తెలుగు నాట ఆయన పేరే ఒక సంచలనం. ఆయన్ను తిట్టే వారు సైతం అభిమానించే విలక్షణమైన తత్త్వం ఆయన సొంతం. మాట్లాడే ప్రతి మాటను బుల్లెట్ గా సంధించే సత్తా.. వ్యూహాం కాని రచిస్తే ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటమే కాదు.. మొండి ఘటం లాంటి కేంద్రాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి తన ఆశను.. కోట్లాది మంది ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడు.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదు.

కేసీఆర్ మాటలే కాదు.. ఆయన రాజకీయ ప్రయాణం చాలా చిత్రంగా ఉంటుంది. పాతాళంలోకిపడటం.. మళ్లీ అక్కడ నుంచి ఒక్కో మెట్టు మెట్టు కట్టుకుంటూ పైకి రావటమే కాదు.. అందరిని శాసించే స్థాయికి చేరటం ఆయనలో కనిపిస్తుంది. రాజకీయాల్లో ఆయన తిన్ననన్ని ఎదురుదెబ్బలు మరే పార్టీ అధినేత తినలేదనే చెప్పాలి. ఇద్దరంటే ఇద్దరు ఎంపీల బలంతో అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారంటే అందులో కేసీఆర్ ప్లానింగ్ ఎంతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అయినా.. ఇప్పించింది మాత్రం కేసీఆర్ అనే చెప్పాలి. సోనియాగాంధీ లాంటి నేతకు.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం మినహా మరే మార్గం లేనట్లుగా పరిస్థితుల్ని తయారు చేయటంలో కేసీఆర్ ను ఎవరూ వంకపెట్టలేరు. ఆంధ్రోళ్లు అని తిట్టేసినా.. విశాఖ వాసులు హుధూద్ తుఫాను సందర్భంగా తీవ్ర ఇబ్బందులకు గురి అయితే.. పెద్ద ప్రచారం లేకుండా భారీ ఎత్తున విద్యుత్ సామాగ్రిని.. సిబ్బందిని విశాఖకు పంపి సాయం చేసిన రెండో కోణం కేసీఆర్ లో ఉందని చెప్పాలి.

తిట్టేటప్పుడు తిట్టటం.. పెట్టేటప్పుడు పెట్టటం లాంటి వైఖరిని ప్రదర్శించే కేసీఆర్.. తాజాగా తన ఆత్మకథను రాసుకునే పనిలో పుల్ బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. తన ఆత్మకథ రాసే పనిలో స్పీకర్ మధుసూదనాచారి సాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ వెలుగు చూడని ఎన్నో కొత్త విషయాల్ని తన ఆత్మకథలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారన్నప్రచారం జరిగిన నేపథ్యంలో.. తన వంశ వృక్షం గురించి పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొదలెట్టిన ప్రజాప్రతినిధిగా టీడీపీ నుంచే ఎన్నికయ్యారని చెప్పాలి. పదవుల పంపకంలో తనకు జరిగిన అన్యాయంపై అలిగిన ఆయన బాబు పార్టీ నుంచి బయటకు వచ్చేసిసొంతంగా టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టటం.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకొచ్చి దశల వారీగా పోరాటం చేయటమే కాదు.. కలలో కూడా సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకోవటం కేసీఆర్ సత్తాకు నిదర్శనంగా చెప్పాల్సిందే. తన ఆత్మకథలో సరికొత్త అంశాల్ని తెరపైకి తీసుకొస్తారని.. తనపై ఉన్న చాలానే విమర్శలకు తన పుస్తకం ద్వారా వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సంచలనాల కేసీఆర్ గా పేరున్న ఆయన ఆత్మకథ మరెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/