Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక ప్లానింగ్ లో భాగంగానే కేసీఆర్ యాదాద్రి టూర్?

By:  Tupaki Desk   |   20 Oct 2021 3:52 AM GMT
ఉప ఎన్నిక ప్లానింగ్ లో భాగంగానే కేసీఆర్ యాదాద్రి టూర్?
X
రాజకీయానికి సంబంధించిన ఏ పరిణామం ఉత్తినే జరిగిపోదు. దాని వెనుక అసలు లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక నేత నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. అందుకు కారణాలు బోలెడన్ని ఉంటాయి. అలాంటిది ఒక ముఖ్యమంత్రి.. అందునా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్ ఏదైనా పని చేశారంటే.. దాని వెనుక అర్థం కాని లెక్కలు చాలానే ఉంటాయి. తాజాగా ఆయన యాదాద్రి పర్యటనకు వెళ్లారు. తరచూ యాదాద్రికి వెళ్లే ఆయన తీరుకు.. తాజా టూర్ కు తేడా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తాజా పర్యటనలో ఆయన యాదాద్రి దేవాలయాన్ని ఎప్పటి నుంచి పున: ప్రారంభిస్తామన్న విషయాన్ని తొలిసారి చెప్పేయటమే కాదు.. ముహుర్తాన్ని కూడా పెట్టేశారు. దీనికి సంబంధించి ఏమేం కార్యక్రమాలు జరుగుతాయన్న విషయాన్ని ఆయన చెప్పటం మర్చిపోకూడదు. మార్చి 28న ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. యాదాద్రి టూర్ కు.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు లింకేమిటి? మోకాలికి బోడిగుండుకు పెట్టినట్లే భలే ఫిట్టింగ్ పెట్టారని అనుకోవచ్చు. కానీ.. తరచి చూస్తే.. కేసీఆర్ టూర్ వెనకున్న లెక్కలు ఇట్టే అర్థమవుతాయి.

మిగిలిన ఎన్నికల సంగతిని పక్కన పెడితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కచ్ఛితంగా అధికార టీఆర్ఎస్.. విపక్ష బీజేపీకి మధ్య నడుస్తున్న పోరు అన్నది తెలిసిందే. సీనియర్ నేత ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ ఎన్నికలో గెలవటం ఆయనకు జీవన్మరణ సమస్య. ఇక.. కేసీఆర్ కు సైతంఈ ఎన్నిక ముఖ్యమే. ఆయన అంచనా వేసుకున్నట్లుగా ఈటల ఓటమి కానీ రియాలిటీలోకి వస్తే.. తెలంగాణలో ఆయనకు మించిన నేత ఉండరని స్పష్టం కావటమే కాదు.. మరికొంతకాలం పాటు ఆయనకు తిరుగులేదన్నది నిరూపితమవుతుంది.

అంతేకాదు.. పోల్ మేనేజ్ మెంట్ లో కేసీఆర్ దరికి వచ్చే వారే లేరన్న విషయం ఝూడీ అవుతుంది. అలాంటి కీలకమైన ఉప ఎన్నిక కోసం కేసీఆర్ ఎంతలా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి ప్రధాన ఆయుధమైన హిందుత్వ ఓటును ప్రభావితం చేసేందుకే తాజా యాదాద్రి టూర్ పెట్టుకున్నట్లు చెబుతారు. ఇప్పటికే దళితబంధు పథకం ద్వారా..నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న దళితుల మనసుల్ని దోచిన ఆయన.. తాజా యాదాద్రి పుణ్యక్షేత్రం పున: ప్రారంభానికి సంబంధించిన కీలక ప్రకటన ద్వారా.. హిందువుల మనసుల్ని సీఎం కేసీఆర్ దోచుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇదే.. ఆయన చేత యాదాద్రి పర్యటనను చేపట్టేలా చేసిందని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. యాదాద్రి టూర్ ను ఇప్పుడే నిర్వహించాల్సిన అవసరం లేదు. దీనికి ముందు కానీ.. నవంబరు ఐదు తర్వాత కానీ చేపట్టొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా టూర్ చేయటం.. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబం తరఫున ఒక కేజీ 16 తులాల బంగారాన్ని మహా గోపురం కోసం విరాళం ఇచ్చిన వైనం చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక లెక్క కూడా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.