Begin typing your search above and press return to search.

మోదీ మంత్రాంగం!..కేసీఆర్‌ కు భారీ దెబ్బ‌!

By:  Tupaki Desk   |   15 April 2018 9:22 AM GMT
మోదీ మంత్రాంగం!..కేసీఆర్‌ కు భారీ దెబ్బ‌!
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఆది నుంచి త‌న‌దైన శైలిలో - త‌న‌దైన రూట్లో బాగా స్పీడుగానే వెళ్లే ర‌కం. ఈ క్ర‌మంలో ఎదురుగా ఎవ‌రు వ‌చ్చినా... ఎవ‌రు అడ్డుప‌డినా కూడా ఏమాత్రం స‌హించ‌ర‌నే చెప్పాలి. అస‌లు త‌న మంత్రాంగానికి అడ్డుప‌డుతున్న వ్య‌క్తి స్థాయి ఏమిట‌న్న విష‌యాన్ని కూడా కేసీఆర్ అంత‌గా ప‌ట్టించుకోర‌నే చెప్పాలి. మొత్తంగా తాను అనుకున్న ప‌నిని నిర్విఘ్నంగా కొన‌సాగించ‌డ‌మే కేసీఆర్ కు ముఖ్యం. ఇందుకు నిద‌ర్శ‌నంగా కేసీఆర్ స‌ర్కారు చేప‌ట్టిన‌ స‌క‌ల జ‌నుల స‌ర్వేను చెప్పుకోవ‌చ్చు. ఓ వైపు కేంద్రం ఈ స‌ర్వే కుద‌రదంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసినా... మా రాష్ట్రంలో మేం స‌ర్వే చేసుకుంటే.. మీకొచ్చిన ఇబ్బందేమిట‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. అయినా స‌ర్వేపై వెన‌క‌డుగు వేసే ప్ర‌సక్తే లేదు... ఎవ‌రొస్తారో చూస్తానంటూ కూడా కేంద్రానికే కేసీఆర్ ఎదురు స‌వాల్ విసిరారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోందంటే... మాటు వేసి దెబ్బ కొట్టే రీతిన ముందుకు సాగుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... ఇప్పుడు కేసీఆర్‌ కు పెద్ద దెబ్బే కొట్టేశారు. నాటి స‌క‌ల జ‌నుల స‌ర్వే మోదీకి గుర్తు లేకున్నా... ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం - ఆ ప్ర‌క‌ట‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా ప‌లు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌ల‌కు కేసీఆర్ వెళుతుండ‌టం - బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల అధినేత‌ల‌తో వ‌రుస భేటీలు మోదీకి నిజంగానే ఇబ్బంది క‌లిగించేవేన‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో కేసీఆర్‌ కు త‌మ ప‌వ‌రేమిటో చూపాల‌న్న రీతిలో మంత్రాంగం న‌డిపిన మోదీ... కేసీఆర్‌ కు గ‌ట్టిగానే దెబ్బ కొట్టార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ దెబ్బేమిట‌న్న వివ‌రాల్లోకి వెళితే.. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌తి వ‌ర్గాన్ని త‌నకు అనుకూలంగా మ‌ల‌చుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా కేసీఆర్ ప‌లు కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. వాటిలో గొర్రెల పంపిణీ ప‌థ‌కం ఒక‌టి. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి ప్ర‌యోజ‌నార్థం... ప్ర‌తి కుటుంబానికి జీవ‌నోపాధి కింద గొర్రెలు - మేక‌లు పంపిణీ చేయ‌డ‌మే ఈ ప‌థ‌కం ఉద్దేశ్యం. ఈ ప‌థ‌కాన్ని భారీ ఎత్తున‌నే నిర్వ‌హించిన కేసీఆర్ స‌ర్కారు పెద్ద సంఖ్య‌లో యాద‌వ కుటుంబాల‌కు గొర్రెల‌ను పంపిణీ చేసింది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు కుటుంబాల‌కు చెందిన వారిని హైద‌రాబాదు పిలిపించి భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని కేసీఆర్ స‌ర్కారు తీర్మానించింది. ఈ వారాంతంలో దాదాపుగా 2 ల‌క్ష‌ల మందితో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ఈ స‌భ‌ను సికింద్రాబాదులోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌రిపేందుకు తీర్మానించారు. అయితే ప‌రేడ్ గ్రౌండ్స్ సికింద్ర‌బాదులోనే ఉన్నా... ఆ స్థ‌లం మాత్రం కేంద్ర ర‌క్ష‌ణ శాఖ ఆధీనంలోనిదేన‌న్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని అధికార పార్టీనే కాకుండా ఏ పార్టీ స‌భ నిర్వ‌హించాల‌న్నా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఈ విష‌యం తెలంగాణ స‌ర్కారుకు కూడా తెలియ‌నిదేమీ కాదు. ఈ క్ర‌మంలోనే యాద‌వ స‌భ నిర్వ‌హ‌ణ కోసం అనుమ‌తి ఇవ్వాలని తెలంగాణ స‌ర్కారు నుంచి కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు ఓ ప్ర‌తిపాద‌న వెళ్లింది. అయితే నెల రోజులు గ‌డుస్తున్నా కూడా కేంద్ర ర‌క్షణ శాఖ నుంచి ఎలాంటి అనుమ‌తి రాలేదు క‌దా... స‌ద‌రు ప్ర‌తిపాద‌న బుట్ట‌దాఖ‌లైన‌ట్లుగా స‌మాచారం. ఈ వ్య‌వ‌హారాన్ని తెలంగాణ త‌ర‌ఫున మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ప‌ర్య‌వేక్షిస్తున్నా... అనుమ‌తిలో ఆల‌స్య‌మ‌వుతోంద‌న్న కార‌ణంతో ఏకంగా కేసీఆర్ కార్యాల‌యం కూడా రంగంలోకి దిగినా కూడా కేంద్రం నుంచి స్పంద‌న రాలేదు. కేంద్రం నుంచి స్పంద‌న క‌న‌పించ‌కున్నా... అనుకున్న తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో కేసీఆర్ స‌ర్కారు ఈ స‌భ‌ను వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. మొత్తంగా త‌న‌కు ఎదురుగా వ‌స్తున్న కేసీఆర్‌ కు మోదీ ఈ ర‌కంగా దెబ్బ కొట్టార‌న్న మాట‌.