Begin typing your search above and press return to search.

'అధికారిక' రాజకీయం !

By:  Tupaki Desk   |   30 Aug 2018 7:34 AM GMT
అధికారిక రాజకీయం !
X
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏ అవకాశాన్నీ వదులుకోరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు అవకాశాలు, యువ‌త‌కు పెళ్ళిళ్లు, వృద్ధులకు పింఛ‌న్లు అన్ని మతస్థులకు వారి వారి పండుగులకు కానుకలు ఇలా అందరినీ ఆకట్టుకుని రాజకీయంగా మరింత బలపడుతున్నారు. చివరికి లబ్దప్రతిష్టులైన వారు మరణిస్తే వారికి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేస్తున్నారు. ఇందులో రాజకీయం కంటే మానవత్వమే ఉందని అందరూ భావిస్తున్నారు. ఎవరు కాదన్నా, అవునన్నా ఈ అధికారిక అంత్యక్రియలు మాత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఖచ్చితంగా కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులపై నిప్పులు చెరగటమే కాదు. దారుణాతి దారుణమైన భాషను ప్రయోగించారు కేసీఆర్. అయితే అదంతా ఉద్యమ సమయంలోనే అని రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇరు ప్రాంతాల మధ్య స్నేహ భావమే ఉండాలని కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. అలా ప్రకటించటమే కాదు అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. రానున్న‌ ఎన్నికలలో సెటిలర్ల ఓట్లు ఎంత కీలకమో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తెలియంది కాదు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన చాల నేర్పుగా వ్యవహరిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన హరిక్రిష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి, ప్రభుత్వం ఇలా అధికారికంగా ఎవరికైనా అంత్యక్రియలు జరపాలంటే వారు ఏదైనా పదవిలో ఉండాలి. లేదూ సంఘంలో విశిష్ట వ్యక్తులై ఉండాలి. హరిక్రిష్ణ గతంలో మంత్రిగా పని చేసారు. ఆ హోదాతోనే ఇప్పుడు ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు కె.చంద్రశేఖర రావు. ప్రత్యేక తెలంగాణను హరిక్రిష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని రెండుగా విడదీసినప్పుడు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మొదటివ్యక్తి హరిక్రిష్ణే. దానిని ప‌క్క‌న పెట్టి మ‌రీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాత్రం హరిక్రిష్ణ అంత్యక్రియలను అధికారికంగా జరపాలని నిర్ణయించడం వెనుక సెటిలర్ల ఓట్ల రాజకీయాలున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.

రానున్న ఎన్నికల్లో సెటిలర్ల మనసు దోచుకోవాలంటే తాను వారి పట్ల ఎంత ఉదారంగా, ప్రేమగా ఉన్నానో చూపించుకోవాలన్నది సిఎం కె.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. గతంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు అంత్యక్రియలను కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతోనే జరపడం గమనార్హం. ఇప్పుడు హరిక్రిష్ణ అంత్యక్రియల వెనుక కూడా ఇదే రాజకీయం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ. కాదేదీ రాజకీయాలకతీతమనే ధోరణిలోనే తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఓ సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులోని మరో కోణం అని ఆయన విశ్లేషించారు.