Begin typing your search above and press return to search.

బాబుకు తాజా షాక్ ఇచ్చేది ఈ బ్ర‌ద‌ర్సేన‌ట‌

By:  Tupaki Desk   |   16 Nov 2019 1:23 PM GMT
బాబుకు తాజా షాక్ ఇచ్చేది ఈ బ్ర‌ద‌ర్సేన‌ట‌
X
వరుస ఓటములతో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లగా మ‌రికొంద‌రు త‌మ దారి తాము చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది. రాయ‌ల‌సీమ‌లో కీల‌క‌ జిల్లా అయిన క‌ర్నూలులో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ప్ర‌ధానంగా, కేఈ కుటుంబ స‌భ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. కృష్ణ‌మూర్తి, ఆయ‌న సోద‌రుడు ప్ర‌భాక‌ర్ ఈ మేర‌కు వైసీపీ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

బ‌ల‌మైన రాజ‌కీయవేత్త‌ల‌కు వేదిక అయిన క‌ర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాల పాటు రాజకీయ వైరం నడిచింది. డోన్‌ నియోజకవర్గం కేంద్రంగా.. రెండు కుటుంబాల మధ్య పొలిటికల్‌ వార్‌ సాగింది. అయినా దాన్ని ప‌క్క‌న‌పెట్టి పాతికేళ్ల తర్వాత కోట్ల, కేఈ కుటుంబాలు ఒకే వేదికపై వ‌చ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, రాయలసీమలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. వైఎస్సార్ క‌డ‌ప‌ జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్‌ ఆ పార్టీ సొంతం. ఈ నేప‌థ్యంలో, వారు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.

మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్యాంబాబు పార్టీని వీడితే కేఈ ప్రభాకర్‌ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే అంటున్నారు. మ‌రోవైపు, బీసీ సామాజికవ‌ర్గానికి చెందిన ముఖ్య‌నేత‌లైన కేఈ బ్ర‌ద‌ర్స్ చేరిక‌పై వైఎస్ జ‌గ‌న్ సైతం ఆయ‌న చేరిక‌కు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. జిల్లాలో ఇప్ప‌టికే క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ ఈ చేరిక‌తో మ‌రింత బ‌లోపేతం అవ‌డం ఖాయ‌మంటున్నారు.