Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ తో పొత్తుపై టీడీపీలో విభేదాలు

By:  Tupaki Desk   |   7 Jun 2018 1:30 AM GMT
కాంగ్రెస్‌ తో పొత్తుపై టీడీపీలో విభేదాలు
X
బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక కాంగ్రెస్‌ తో కలవడానికి ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబు తానా అంటే తందానా అనే నిన్నమొన్నటి నేతలంతా ఆయన నిర్ణయానికి తలూపుతున్నా సీనియర్లు కొందరు మాత్రం ఈ అక్రమ పొత్తును ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. పొత్తు ఇంకా అధికారికంగా కుదరకపోయినప్పటికీ టీడీపీ కాంగ్రెస్‌ లు భుజంభుజం కలుపుతున్నాయని మాత్రం అర్థమవుతోంది . అందుకు తగ్గట్లుగానే చంద్రబాబుకు వంతపాడే పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్ పాపాలను మర్చిపోయి ఆ పార్టీ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు అలాంటివే. అదే సమయంలో ఏపీ మంత్రి - సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి మాత్రం కాంగ్రెస్‌ తో పొత్తు విషయంలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంత పనీ చేస్తే తాను ఉరేసుకుంటానన్నారు.

ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుందనే నమ్మకం పోయిందని.. ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కంటే బీజేపీ ఎక్కువ అన్యాయం చేసిందని జయదేవ్ అన్నారు. అంతేకాదు.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరితో కలిసి తాము ముందుకు సాగాలనే విషయమై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఖరారైనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరోవైపు టీడీపీలోని సీనియర్లు మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకోవడానికి కూడా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం కేఈ అన్నారు. ఆయన వ్యాఖ్యల తీవ్రత సీనియర్ల ఆవేదనకు అద్దం పడుతోంది. ఆయనే కాదు మరికొందరు సీనియర్లు కూడా చంద్రబాబు పోకడలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.