Begin typing your search above and press return to search.

బాబును కేఈ ఓపెన్‌గానే అనేశాడు

By:  Tupaki Desk   |   23 May 2015 2:15 PM GMT
బాబును కేఈ ఓపెన్‌గానే అనేశాడు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఒక విచిత్ర‌మైన అల‌వాటు ఉంది. కిందిస్థాయి నుంచి పైకి రావ‌టం వ‌ల్ల‌నో.. ముందుజాగ్ర‌త్త కార‌ణ‌మో కానీ.. ఆయ‌న అత్యున్న‌త స్థానంలోఉన్న‌ప్ప‌టికీ.. పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల విష‌యంలో ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. అది ఆయ‌న‌కు లాభం కంటే న‌ష్టం చేసిన సంద‌ర్భాలే ఎక్కువ‌.

అనుకున్న దాని కంటే పెద్ద‌పీట వేసి.. అత్యున్న‌త స్థానంలో కూర్చొబెట్టిన‌ప్ప‌టికీ.. క‌ర్నూలు జిల్లాకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి.. చంద్ర‌బాబు మీద అసంతృప్తి రూపంలో విమ‌ర్శ‌లు చేయ‌టం మామూలే. పాల‌న మీద మొద‌లు పార్టీ వ్య‌వ‌హారాల వ‌ర‌కూ స‌టైర్లు వేయ‌టం.. న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేయ‌టం కేఈకి అల‌వాటే.
తాజాగా ఆయ‌న త‌న అల‌వాటును మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. ఇందుకోసం క‌ర్నూలులో నిర్వ‌హిస్తున్న మినీ మ‌హానాడును వేదిక‌గా చేసుకున్నారు. గ‌తంలోనూ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా బాబుపై వ్యాఖ్య‌లు చేసిన కేఈ.. త‌ర్వాత దాన్ని క‌వ‌ర్ చేసుకునేందుకు తెగ ప్ర‌య‌త్నించారు.
ఆయ‌న‌పై గుర్రుగా ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో ధైర్యం చాల‌ని బాబు.. వేచి ఉండే ధోర‌ణిని అనుస‌రిస్తున్నారు. ఇక‌.. తాజాగా కేఈ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ముఖ్య‌మంత్రి.. త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఎంత‌సేప‌టికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మీద‌నే చూపు ఉందంటూ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో మూడు సీట్లు రావ‌టంలో త‌మ త‌ప్పు ఏమీ లేద‌ని స‌మ‌ర్థించుకున్న ఆయ‌న‌.. క‌ర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి జిల్లాలో ఏ వీధి ఎక్క‌డ ఉందో కూడా తెలీద‌ని వ్యాఖ్యానించారు. అలాంటి వ్య‌క్తిని జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించ‌టం సాహ‌స చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ముఖ్య‌మంత్రి బాబు.. క‌ర్నూలు జిల్లాను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని.. కేవ‌లం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్న అసంతృప్త వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వంపై ప్ర‌భావం చూపించ‌టం ఖాయం. మ‌రి.. దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.