Begin typing your search above and press return to search.

చంద్రబాబును మించిన మొనగాళ్లే లేరట..

By:  Tupaki Desk   |   25 May 2016 8:38 AM GMT
చంద్రబాబును మించిన మొనగాళ్లే లేరట..
X
నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇన్నీ అన్నీ సమస్యలు ఎదుర్కోలేదు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు.. రాజధాని లేని రాష్ట్రానికి రూపురేఖలు ఇవ్వడం... అభివృద్ధి.. భూసమీకరణ.. ఇలా ఎన్నో సవాళ్లను ఆయన ఎదుర్కొంటూ వస్తున్నారు. వీటికి తోడు పార్టీలో అంతర్గత సమస్యలు. డిప్యూటీ సీఎం - రెవెన్యూ మంత్రితో సంబంధం లేకుండా రాజధాని వ్యవహారాలు పురపాలక మంత్రి నారాయణకు అప్పగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన కేఈ పలుమార్లు చంద్రబాబుపై విసుర్లు విసిరిన సందర్భాలున్నాయి. కేఈ తరచూ చంద్రబాబును ఇరుకున పెట్టేలా మాట్లాడేవారు. ఆయనతోనే ప్రధాన సమస్యగా ఉండేది.

అయితే.. క్రమంగా మిగతా సమస్యలన్నీ సర్దుకుంటున్నట్లుగానే కేఈ వ్యవహారంలో కూడా మార్పు వస్తుండడంతో చంద్రబాబుకు ఆ తలనొప్పి కూడా తగ్గింది. చంద్రబాబు నాయకత్వాన్ని ఉద్దేశించి కేఈ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన దారికి వచ్చారనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. చంద్రబాబు ఒక్కరే రాష్ట్రానికి నాయకత్వం వహించగల సమర్థమైన వ్యక్తి అని ప్రజలు భావిస్తున్నారని కేఈ ఈ రోజు చెప్పడం కీలక పరిణామమనే అనుకోవాలి.

విజయవాడలో ఈ రోజు జరుగుతోన్న కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ మంత్రి కేఈ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని కొన్ని పార్టీలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాయని.. ముఖ్యమంత్రిపై పదేపదే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఈ సీనియర్ నేత విపక్షాలను గట్టిగా హెచ్చరించారు. జల సంరక్షణపై గత రెండేళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని, జల సంరక్షణపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. మీ సేవా కేంద్రాల్లో ఎక్కువ రుసుముల వసూలు వెనుక వీఆర్‌వోలు ఉన్నారనే భావన ఉందన్నారు. మీ సేవా కేంద్రాల్లో ఎవరైనా తప్పులు చేసి ఉంటే చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడొద్దని కేఈ సూచించారు.

కాగా కేఈ తీరు మారడానికి ఇటీవల కాలంలోని పరిణామాలే కారణమని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ నుంచి నేతలు టీడీపీలోకి రావడంలో కేఈ కూడా కీలక పాత్ర పోషించారు. అయితే, వారు వచ్చిన తరువాత వారితో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ముఖ్య నేతలకు విభేదాలు రావడంతో చంద్రబాబుకు కొంత తలనొప్పి ఏర్పడింది. వాటిని పరిష్కరించే బాధ్యత దాదాపుగా కేఈకి అప్పగించారు. ఆ లెక్కన చంద్రబాబు తనకు ప్రాధాన్యమిచ్చినట్లుగానే భావించిన కేఈ ఆ పని సమర్థంగా చేశారు. ప్రస్తుతం ఆయన సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా మొదట్లో తన పదవికి ఎసరొస్తుందేమో అని కేఈ కొంత అభద్రతకు లోనయ్యేవారని.. చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టినా కేఈ పదవికి ఢోకా లేదని స్పష్టంగా తేలడంతో ఆయన తన తీరు మార్చుకున్నారని.. ముఖ్యమంత్రికి సహకరిస్తూ పోవాలని నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ల సమావేశం వేదికగా కేఈ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనాలని అంటున్నారు.