Begin typing your search above and press return to search.

ఏపీ డిప్యూటీ సీఎంలకు టిక్కెట్లు డౌట్

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:22 PM GMT
ఏపీ డిప్యూటీ సీఎంలకు టిక్కెట్లు డౌట్
X
చంద్రబాబు పాలిటిక్సుకు సొంత పార్టీ నేతలే గిలగిలలాడుతున్నారు. ప్రస్తుతం ఏపీకి ఉపముఖ్యమంత్రులుగా ఉన్న చినరాజప్ప - కేఈ కృష్ణమూర్తిలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవచ్చని టీడీపీలో వినిపిస్తుండడంతో వారిద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. నిజానికి వారిద్దరూ పేరుకే డిప్యూటీ సీఎంలయినా వారికి అధికారాలు మాత్రం లేవు. వారివారి సొంత శాఖలపైనా చంద్రబాబు పెత్తనమే సాగుతోంది. దీంతో ఇప్పటికే వారు కక్కలేక మింగలేక కేబినెట్లో కొనసాగుతుండగా ఇప్పుడు టిక్కెట్లు విషయంలోనూ వారికి మొండిచేయి ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారన్న వార్త ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.

రెవెన్యూ శాఖ చూస్తున్న ఒక డిప్యూటీ సీఎం కేఈ సొంత శాఖలో బదిలీలు కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్నారట. ఇక హోం శాఖ మంత్రిగా ఉన్న మరో డిప్యూటీ సీఎం చిన్నరాజప్పదీ అదే పరిస్థితి. ఆయన్నే గుర్తు పట్టని పోలీసు అధికారులున్నారు. ఇలా ఇప్పటికే డమ్మీలుగా మార్చిన చంద్రబాబు వారి టిక్కెట్లకూ ఎసరు పెట్టేందుకు రెడీ అవుతున్నారని టాక్.

నిజానికి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కేఈ ఇప్పటికే చెప్పారు. అయితే, తనకు బదులు తన కుమారుడికి టిక్కెట్ కోరుతున్నారాయన. అయితే... కేఈ తనయుడిపై కేసులు ఉండడంతో ఆయనకు టిక్కెట్ నిరాకరించారట చంద్రబాబు. వయసు పెరగడంతో కేఈ చురుగ్గా తిరగలేకపోతున్నారన్న సాకుతో ఆయనకూ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేరట. మరో డిప్యూటీ సీఎం చినరాజప్ప టిక్కెట్‌ కు చంద్రబాబు సొంత సామాజికవర్గ నేత ఒకరు ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లిన ఆయన ఇప్పుడు టీడీపీలోకి మళ్లీ రావడంతో చంద్రబాబు ఆయనవైపు మొగ్గు చూపుతున్నారట.