Begin typing your search above and press return to search.

ఆ లాజిక్ ఏందో కేఈకైనా తెలుసా?

By:  Tupaki Desk   |   9 Oct 2015 11:09 AM GMT
ఆ లాజిక్ ఏందో కేఈకైనా తెలుసా?
X
రాజకీయ నాయకులు అన్నాక ప్రత్యర్థులపై విమర్శలు చేయటం.. ఆరోపణలు చేస్తుంటారు. రాజకీయంగా దెబ్బ కొట్టే ఏ చిన్న అవకాశాన్ని వారు వదిలిపెట్టరు. అయితే.. చేసే విమర్శల్లో.. ఆరోపణల్లో కాస్త పస ఉంటే బాగుంటుంది. కానీ.. అదేమీ లేకుండా మాట్లాడే నేతలు కొందరు ఉంటారు. తాము మాట్లాడే మాటల్లో అర్థాన్ని విడదీసి అడిగితే చెప్పలేని పరిస్థితి.

తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాటలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షపైన ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్షను కేఈ తనదైన శైలిలో చెప్పుకుపోయారు. కేసుల నుంచి బయటపడేందుకే దీక్షలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పుడు చేస్తున్న దీక్షలకు.. జగన్ కేసులకు సంబంధం ఏమిటో కేఈకి మాత్రమే అర్థం కావాలి.

నిజానికి జగన్ దీక్షతో ప్రత్యేక హోదా గురించి చర్చ రోజురోజుకి మరింత పెరగటమే కానీ.. తగ్గని పరిస్థితి. ఇది అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఇబ్బంది కలిగించేదే. దాని వల్ల జగన్ కు ఇబ్బందులే తప్ప లాభం ఉండదు. నిజంగా కేసుల నుంచి బయట పడాలన్న ఉద్దేశ్యమే ఉంటే.. ఎవరికి ఆగ్రహం.. చిరాకు తెప్పించకూడదో జగన్ కు తెలీదా? కానీ.. వాటిని పట్టించుకోకుండా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తుంటే.. కేఈ లాంటి వారు.. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ దీక్ష చేస్తన్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలైతే.. ‘‘తాను చెప్పే మాటలకు అసలా పెద్దమనిషికైనా అర్థం అవుతుందా?’’ అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. చేసే విమర్శ అయినా కాస్తంత వాడీ. వేడీ ఉండేలా చేయొచ్చుగా కేఈ సార్.