Begin typing your search above and press return to search.

పవన్ అజ్ఞాత‌వాసి..అవ‌న్నీ గాలి వార్తలే:కేఈ

By:  Tupaki Desk   |   22 Jun 2018 12:44 PM GMT
పవన్ అజ్ఞాత‌వాసి..అవ‌న్నీ గాలి వార్తలే:కేఈ
X
తిరుమ‌ల వెంక‌న్న ఆల‌యంలోని శ్రీ‌వారి పోటులో విలువైన నిధుల కోసం త‌వ్వ‌కాలు జ‌రిగాయ‌ని - విలువైన పింక్ డైమండ్ అదృశ్యం కావ‌డం అనుమానాస్ప‌దంగా ఉంద‌ని ఆల‌య మాజీ ప్ర‌ధానార్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌వ్వ‌కాల వెనుక ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతోపాటు ఓ `మేడ‌మ్`ఉన్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ త‌వ్వ‌కాల‌పై కేంద్రం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ర‌మ‌ణ‌దీక్షితులుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మ‌ద్ద‌తు తెలుపుతూ ట్వీట్ చేశారు. పింక్ డైమండ్ తో పాటు త‌వ్వ‌కాల వ్య‌వ‌హారంపై ఫోరెన్సిక్ నిపుణ‌ల‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వ వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణదీక్షితులు వంటి విశ్వనీయత లేని వ్యక్తులకు పవన్‌ మద్దతు తెలపడం రాజకీయ కుట్ర అని మండిప‌డ్డారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాతే ప‌వ‌న్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కేఈ నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల‌పాటు త‌మ‌తో పొత్తు పెట్టుకున్న జ‌నసేనాని ఇపుడు ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డంపై మండిప‌డ్డారు. రియ‌ల్ లైఫ్ కు ...రీల్ లైఫ్ కు ఉన్న తేడాను ప‌వ‌న్ తెలుసుకోవాల‌ని కేఈ ఎద్దేవా చేశారు. వాస్త‌వాల‌ను గ్ర‌హించ‌కుండా అర్థ‌ర‌హిత‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హితువు ప‌లికారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేఈ....పవన్ పై అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీతో జ‌న‌సేన‌ తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ప‌వ‌న్ పై టీడీపీ నేత‌లు సంద‌ర్భానుసారంగా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, ర‌మ‌ణ దీక్షితులుకు మ‌ద్ద‌తు తెలిపిన ప‌వ‌న్ పై టీడీపీ నేత‌లు మ‌రోసారి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జ‌న‌సేనానిపై ఉప ముఖ్య‌మంత్రి కేఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పవన్‌ అంటే గాలి అని, గాలి వార్తలు నమ్మడం తప్ప ప‌వ‌న్ కు ఆలోచించే శక్తి లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్‌ ఒక అజ్ఞాతవాసి అని, రీల్‌ లైఫ్ కు రియల్‌ లైఫ్ కు తేడా తెలీద‌ని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవటం ప‌వ‌న్ కు అల‌వాటైంద‌ని, కానీ, రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన ప‌వ‌న్ తప్పుడు ప్రచారాలు చేయకుండా బాధ్యతగా మెలగాల‌ని హిత‌వు ప‌లికారు. అమరావతి భూముల విషయంలో పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని, 99 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన విష‌యం ప‌వ‌న్ గుర్తించాల‌ని చెప్పారు. అమ‌రావ‌తిలో పవన్‌ పర్యటిస్తే అక్కడి ప్రజలే ఆయ‌న‌కు బుద్ధి చెబుతార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.