Begin typing your search above and press return to search.

​ఏపీ డిప్యూటీ సీఎం రాజ‌కీయ సన్యాసం?

By:  Tupaki Desk   |   23 Oct 2017 6:35 AM GMT
​ఏపీ డిప్యూటీ సీఎం రాజ‌కీయ సన్యాసం?
X
ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేఈ కృష్ణ‌మూర్తి నోరు విప్పితే విశేషాల‌కు కొద‌వ ఉండదు. ప్ర‌శ్నలు అడుగుతుండాలే కానీ.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే విష‌యాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట్ల‌ను చెప్పుకొచ్చారు.

అవేంటో చూస్తే..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కేఈ.. త‌న స్థానంలో ఎవ‌రు పోటీ చేస్తార‌న్న విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ఇద్ద‌రు కుమారులు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. తాను ప్రాతినిధ్యం పోషిస్తున్న ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న రెండో కుమారుడు శ్యాంబాబు పోటీ చేస్తార‌న్నారు. ఇందుకు సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు.

కేఈ కుటుంబానికి రాజ‌కీయంగా ఏ మాత్రం పొస‌గ‌ని కోట్ల కుటుంబానికి చెందిన మాజీ కేంద్ర‌మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టీడీపీలోకి వ‌స్తున్న‌ట్లుగా వార్త‌లు రావ‌టంపై కేఈ రియాక్ట్ అయ్యారు. ఆయ‌న పార్టీలోకి రావాల‌నుకుంటున్నార‌ని.. అందుకు బాబు సైతం సానుకూలంగా ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

చిన్న‌వాడు కానీ పెద్ద‌వాడు కానీ ఎవ‌రు పార్టీలోకి వ‌చ్చినా చేర్చుకోవాల‌న్న‌దే అధినేత అభిమ‌త‌మ‌ని.. ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌లంగా ఉండ‌కూడ‌ద‌న్న‌దే ఆలోచ‌న‌గా చెప్పారు. కోట్ల పార్టీలో రావ‌టాన్ని తాను వ్య‌తిరేకించ‌టం లేద‌ని చెప్పారు. క‌ర్నూలు ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత బుట్టా రేణుక పార్టీలోకి రావ‌టంపైనా త‌న అభిప్రాయాన్ని చంద్ర‌బాబు అడిగార‌ని.. తానేమీ అడ్డు చెప్ప‌లేద‌న్నారు.

కోట్ల ఫ్యామిలీతో వైరం ఎందుకు మొద‌లైంద‌న్న విష‌యంపై కేఈ గ‌తంలోకి వెళ్లి ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పుకొచ్చారు. 1938లో కాంగ్రెస్ లో డీసీసీ ఉండేద‌ని.. అందులో త‌న తండ్రి కేఈ మాద‌న్న డైరెక్ట‌ర్ గా పోటీ చేశార‌ని.. విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి చిన్నాన్న ఓడిపోవ‌టంతో క‌క్ష‌లు మొద‌లైన‌ట్లుగా చెప్పారు. త‌మ‌కు సంబంధం లేకున్నా గ్రామాల్లో ప‌ల్లెల‌న్నీ రెండు వ‌ర్గాలుగా విడిపోయి.. ఫ్యాక్ష‌న్ పెరిగింద‌ని.. ఇప్పుడు అలాంటిది లేద‌న్నారు.