Begin typing your search above and press return to search.

ఓడిపోతాననే కేఈ రిటైర్ మెంటా.?

By:  Tupaki Desk   |   22 Aug 2018 1:39 PM GMT
ఓడిపోతాననే కేఈ రిటైర్ మెంటా.?
X
2019 ఎన్నికలకు అందరూ సిద్ధమవుతున్న వేళ.. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలిగేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చేసారి టీడీపీ తరఫున నిలబడ్డా గెలిచే చాన్స్ తక్కువేనని ఆయన బలంగా నమ్ముతున్నారట.. అందుకే ఈ మధ్య వైరాగ్యపు మాటలు మాట్లాడుతున్నాడు. తాను రిటైర్ అయ్యి తన కొడుకును రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కానీ డిప్యూటీ సీఎం కొడుకుకు గెలుపు అంత ఈజీగా కనిపించడం లేదు. ఓ వైపు అసమ్మతి.. మరోవైపు భీకరమైన ప్రత్యర్థి.. ఈ నేపథ్యంలో తన కుమారుడి గెలుపునకు ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నాడట ఏపీ డిప్యూటీ సీఎం.. ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ లేనంత టైట్ గా మారాయట..

ఏపీ రాజకీయాల్లో సీనియర్ లీడర్ గా కేఈ కృష్ణమూర్తికి అపార రాజకీయ అనుభవం ఉంది. ఇన్నాల్లు చేసిన రాజకీయం చాలించి ఇక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన స్థానంలో కుమారుడు శ్యాంబాబును 2019 అసెంబ్లీ బరిలో దింపాలని యోచిస్తున్నాడు.

అటు వైసీపీ నుంచి కంగాటి శ్రీదేవి లాంటి బలమైన ప్రత్యర్థి పొంచి ఉంది. శ్రీదేవి భర్త నారాయణ రెడ్డి హత్య కేసులో శ్యాంబాబు నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యాంబాబును ఓడిస్తానని శ్రీదేవి శపథం చేశారని అంటున్నారు. మరోవైపు భారీ ప్రచారంతో తనయుడిని గెలిపించేందుకు కేఈ వ్యూహాలు రచిస్తున్నారట.. ఇరు పార్టీలు నువ్వానేనా అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాయి. దీంతో పత్తికొండ పాలిటిక్స్ హీటెక్కాయి.

నారాయణ రెడ్డి హత్య తర్వాత ఆయన సతీమణి శ్రీదేవిని వైసీపీ పత్తికొండ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన తొలి అభ్యర్థి శ్రీదేవి కావడం విశేషం. నారాయణ రెడ్డి హత్య తర్వాత ప్రజల్లో శ్రీదేవికి విపరీతమైన సానుభూతి రాగా.. కేఈపై పీకల్లోతూ కోపం ఉందని వైసీపీ నేతలు అంచనావేస్తున్నారు. ఇక కేఈపై అసమ్మతి సెగ ఎక్కువైంది. శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ నాగేంద్ర కేఈపై అసమ్మతికి తెరతీశారు. తుగ్గలి మండలంలో నాగేంద్రకు పట్టుంది. దీంతో నాగేంద్రను మచ్చిక చేసుకునేందుకు కేఈ ఫోకస్ చేశారట..

మరోవైపు టీడీపీ పత్తికొండ అభ్యర్థి గా శ్యాంబాబును టీడీపీ ప్రకటించలేదు.కానీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆయనే ఉన్నాడు. ఇటు టీడీపీ, అటు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులే కాకుండా బద్ధ శత్రువులు.. దీంతో నియోజకవర్గంలో రాజకీయ భగ్గుమంటోంది. కేఈకి అసమ్మతి సెగలు వెంటాడుతున్నాయి.

ఇక కాంగ్రెస్ తరఫున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. దీంతో ఆయన గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక కొడుకును గెలుపించుకునేందుకు కేఈ.. తన భర్తను హత్య చేసిన శ్యాంబాబును ఓడించాలని శ్రీదేవి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ వైరానికి మించి వ్యక్తిగత శత్రుత్వం పత్తికొండలో నడుస్తోంది. దీంతో వైసీపీ , టీడీపీలు నువ్వానేనా అన్నట్టు భీకరంగా పోరాడుతున్నాయి..ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పత్తికొండలో ఎవరు గెలుస్తారన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.