Begin typing your search above and press return to search.

భూ సేక‌ర‌ణ..అంతా తూచ్ అన్న కేఈ

By:  Tupaki Desk   |   28 Aug 2015 10:00 AM GMT
భూ సేక‌ర‌ణ..అంతా తూచ్ అన్న కేఈ
X
న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణానికి భూ సేక‌ర‌ణ అంశంపై స్పందించిన ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న మాట‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. రైతుల భూముల విష‌యంలో త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని కేఈ వివ‌ర‌ణ ఇచ్చారు. భూ సేక‌ర‌ణ అన‌వ‌స‌రం లేకుండానే రైతులు భూములు ఇస్తార‌ని తాను అన్న‌ట్లు చెప్పారు. రాజ‌ధాని కోసం రైతులు ఇప్ప‌టికే 33,000 ఎక‌రాలు ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. రెవెన్యూ అధికారుల స‌హ‌కారంతో భూ సమీక‌ర‌ణ ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌న్నారు.

రాజధాని విషయంలో మంత్రి నారాయణకు, ఉప ముఖ్యమంత్రి కేఈకి మధ్య విబేధాలున్నాయన్న కొంద‌రు కావాల‌నే ప్ర‌చారం చేస్తున్నార‌ని కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజధాని విషయంలో తనకూ మంత్రి నారాయణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్ప‌ష్టం చేశారు. రాయ‌ల‌సీమ అభివృద్ధి కోసం త‌న‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏ నిర్ణయానికైనా తన‌తో స‌హా మంత్రులమంతా కట్టుబడి ఉంటామని తెలిపారు.రాజధాని విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని కేఈ విమర్శించారు.

రాజ‌ధాని నిర్మాణానికి ఎవ్వ‌రు అడ్డుప‌డ్డా..ప్ర‌జ‌ల స‌హ‌కారంతో తాము ముందుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో పాటు స‌ల‌హాల‌ను స్వీక‌రిస్తామ‌ని తెలిపారు.