Begin typing your search above and press return to search.

పొత్తుపై బాబు మ‌న‌సును ఆవిష్క‌రించిన కేఈ

By:  Tupaki Desk   |   27 Aug 2018 7:31 AM GMT
పొత్తుపై బాబు మ‌న‌సును ఆవిష్క‌రించిన కేఈ
X
మొన్న‌టి మొన్న వ‌ర‌కూ కాంగ్రెస్ తో పొత్తుపై అగ్గిలం మీద గుగ్గిలంలా విరుచుకుప‌డిన ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి టోన్ లో తేడా వ‌చ్చేసింది. కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవ‌ట‌మా? అంత‌కు మించిన అప‌చారం ఈ ప్ర‌పంచంలో మ‌రొక‌టి ఉంటుందా? అన్న రేంజ్లో చెల‌రేగిపోవ‌ట‌మే కాదు.. అధినేత మ‌న‌సును అర్థం చేసుకోకుండా త‌న‌దైన ఆవేశంతో విరుచుకుప‌డ్డారు. స‌మ‌యం సంద‌ర్భం లాంటివేమీ చూసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌తారా? అంటూ బాబు పీకిన క్లాస్ పుణ్య‌మేమో కానీ.. కేఈ టోన్ లో తాజాగా మార్పు వ‌చ్చేసింది.

మొన్నామ‌ధ్య కాంగ్రెస్ తో పొత్తుపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు భిన్న‌మైన మాట‌లు ఆయ‌న నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. ఏపీలో కాంగ్రెస్ తో ఎన్నిక‌ల పొత్తు ప్ర‌స‌క్తే ఉండ‌ద‌ని.. అయితే.. ప్రాంతీయ అవ‌స‌రాల దృష్ట్యా ఇత‌ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పాటు మ‌రే పార్టీతోనైనా క‌లిసి పోటీ చేసేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేదంటూ కొత్త రాగాన్ని బ‌య‌ట‌కు తీశారు.

తేడా అంటే తేడానే కానీ.. ఒక రాష్ట్రంలో తేడా ఉన్న పార్టీకి మ‌రో రాష్ట్రంలో తేడా రాక‌పోవ‌టం అంటే.. అది న్యాయ‌మా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌య్యే ప‌రిస్థితి. అర్థ‌రాత్రి పార్ల‌మెంటు త‌లుపులు మూసి అడ్డంగా రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ పార్టీని ఏపీలో ప్ర‌జ‌లు క్ష‌మించే ప‌రిస్థితి లేద‌న్నారు. అందుకే ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు ఉండ‌ద‌ని తేల్చేశారు.

ఆవేశం పాళ్లు కేఈలో కాస్త ఎక్కువైన‌ట్లున్నాయి. పార్ల‌మెంటు త‌లుపు మూసి విభ‌జ‌న చేశార‌న్న‌ది క‌రెక్టే అయినా.. అర్థ‌రాత్రి లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల కేఈ లాంటి పెద్ద మ‌నిషి మీద ఉన్న మ‌ర్యాద పోతుంద‌న్న‌ది ఆయ‌న గుర్తిస్తే మంచిది. విభ‌జ‌న పాపం కాంగ్రెస్ దే అయితే.. బీజేపీది కూడా అన్న పాయింట్ కేఈ ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు? విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ ది త‌ప్పే కానీ.. ఇప్పుడు త‌ప్పు దిద్దుకుంటాన‌ని.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో కొత్త క‌మిట్ మెంట్ ను ఇస్తున్న వేళ‌.. ఆ పార్టీతో దోస్తానా ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు మేలు చేయ‌దా? అన్న ప్ర‌శ్న‌కు నో అంటే నో అనేస్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు నో అనేస్తున్న కేఈ మాష్టారు.. తెలంగాణ‌లో మాత్రం (ఆ పేరు ఎత్త‌టం లేదు కానీ..ఇత‌ర రాష్ట్రాల్లో అన్న మాట‌ను ఆయ‌న వాడుతున్నారు) త‌మ పార్టీ ఎవ‌రితో పొత్తు పెట్టుకున్నా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్న మాట‌లో డొల్ల‌త‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. మొత్తంగా చూస్తే.. టీడీపీ.. కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఏపీ సంగ‌తి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ లో ఉంటుంద‌న్న సంకేతాన్ని కేఈ ఇచ్చిన‌ట్లు అనుకోవాలా? ఇదంతా ఒక ఎత్తు అయితే త‌న మాట‌ల‌కు ఫినిషింగ్ ట‌చ్ గా కేఈ చేసిన వ్యాఖ్య‌ను ఇక్క‌డ ప్ర‌స్తావించ‌టం సంద‌ర్భోచితం అవుతుంది.

దేశంలో విభిన్న‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని.. కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వాలు పాల‌న సాగుతున్నాయ‌న్న విష‌యాన్ని చెబుతూ.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణి మారింద‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌తో అన్ని విధాలుగా ద‌గాబ‌డ్డ తెలుగువారి సంక్షేమం కోసం త‌మ అధినేత చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకున్నా క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడిలా తాను ఆయ‌న వెంటే ఉంటాన‌ని చెప్పారు. ఈ మాట‌ల‌న్ని విన్నాక పొత్తు విష‌యంలో కేఈ మాష్టారు యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు అనిపించట్లేదు?