Begin typing your search above and press return to search.

ఆయన వద్దని వదిలేస్తే టీడీపీ ఏరుకుంటోందట..

By:  Tupaki Desk   |   25 Dec 2017 5:48 PM GMT
ఆయన వద్దని వదిలేస్తే టీడీపీ ఏరుకుంటోందట..
X
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేడి రాజుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం మాటల ఈటెలు విసురుతున్నారు. వారి వాగ్బాణాలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు.

కర్నూలు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానం నిజానికి టీడీపీ చేతిలోనే ఉండేది. ఆ స్థానాన్ని గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో వైసీపీలోకి వచ్చారు. అయితే... పార్టీ మారినప్పుడు నైతిక విలువలు పాటిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానానికే మళ్లీ ఎన్నిక జరుగుతోంది. అయితే, ఒకసారి రాజీనామా చేసిన స్థానానికి మళ్లీ పోటీ చేయబోనంటూ ఆయన బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది.

ఇక్కడ టీడీపీ త‌మ అభ్య‌ర్థిగా కేఈ ప్ర‌భాక‌ర్ పేరును ప్ర‌క‌టించింది. ఈ స్థానానికి జనవరి 21న ఎన్నిక జరపనున్నట్లు ఇదివరకే ఈసీ ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన శిల్పా చ‌క్ర‌పాణి తాను నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి రాజీనామా చేశాన‌ని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసిన ప‌దవి కోసం మ‌ళ్లీ యుద్ధం చేయాల్సిన అవ‌స‌రం లేద‌నుకున్నాన‌ని అన్నారు. నేను విసిరేసిన పోస్టును టీడీపీ నేత‌లు పోటీప‌డి ఏరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.