Begin typing your search above and press return to search.

గౌరు త‌ప్పుకున్నా... కేఈకి పోటీ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   26 Dec 2017 11:25 AM GMT
గౌరు త‌ప్పుకున్నా... కేఈకి పోటీ త‌ప్ప‌దా?
X
క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప‌లు మ‌లుపులు తిరుగుతోంది. వైసీపీని బోల్తా కొట్టించే దిశ‌గా ప‌క్కా ప్లాన్ ర‌చించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... అందులో దాదాపుగా విజ‌యం సాధించార‌నే చెప్పాలి. చివ‌రి నిమిషం దాకా పార్టీ అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించ‌కుండా... వైసీపీలో టెన్ష‌న్ కొన‌సాగేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు ఊహించిన‌ట్లుగానే వైసీపీ బ‌రి నుంచి త‌ప్పుకోగా... ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన బాబు... డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు - మాజీ మంత్రి కేఈ ప్ర‌భాక‌ర్‌ ను ఏక‌గ్రీవంగానే మండ‌లికి పంపేందుకు రంగం సిద్ధం చేశారు. ఇటీవ‌లే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి రాజీనామాతో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో టీడీపీ నుంచి నందికొట్కూరు టీడీపీ ఇన్‌ చార్జీ మాండ్ర శివానంద‌రెడ్డి బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం సాగింది. వైసీపీ జిల్లా క‌న్వీన‌ర్‌ గా ఉన్న గౌరు వెంక‌ట‌రెడ్డికి శివానంద‌రెడ్డి అతి స‌మీప బంధువు. ఈ నేప‌థ్యంలో శివానంద‌రెడ్డిపై తాను పోటి చేయ‌డం బాగోద‌ని భావించ‌డం, అంతేకాకుండా పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగినా... విజ‌యం సాధించేంత‌గా ఓట్లు లేని అంశాల‌ను ప్రస్తావించిన గౌరు వెంక‌ట‌రెడ్డి పోటీ చేసేందుకు విముఖత వ్య‌క్తం చేశారు.

ఇదే విష‌యాన్ని కాస్తంత సానుకూల దృక్ప‌థంతోనే ప‌రిశీలించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా క‌ర్నూలు ఎమ్మెల్సీ బ‌రిలో అభ్య‌ర్థిని దింపేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో నిన్న సాయంత్ర‌మే పార్టీ నుంచి ఈ మేరకు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. అయితే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే... త‌న వ్యూహానికి తెర తీసిన చంద్రబాబు... శివానంద‌రెడ్డికి బ‌దులుగా కేఈ ప్ర‌భాక‌ర్‌ను రంగంలోకి దించుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శివానంద‌రెడ్డి అయితే తాను పోటి చేయ‌న‌ని చెప్పిన గౌరు... కేఈ పేరు ప్ర‌క‌టించ‌గానే... పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. జిల్లావ్యాప్తంగా మంచి ప‌ట్టే ఉన్న గౌరు... కేఈపై పోటీకి దిగుతాన‌ని - విజ‌యం సాధిస్తాన‌ని కూడా త‌న అనుచ‌రుల వ‌ద్ద పేర్కొన్న‌ట్లుగా తెలిసింది. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్‌ కు వివ‌రించేందుకు అనంత‌పురం జిల్లా గాండ్ల‌పెంట వ‌ద్ద‌కు వెళ్లి పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ ను క‌లిశారు. జిల్లాలో స‌మీక‌ర‌ణాలు అన్నింటినీ కూడా ఆయ‌న జ‌గ‌న్ ముందు పెట్టారు. కేఈ అభ్య‌ర్థిగా ఉంటే విజ‌యం మ‌న‌దేన‌ని కూడా త‌న వాద‌న‌ను గ‌ట్టిగానే వినిపించారు. అయితే ఇప్ప‌టికే పార్టీ నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో పోటీ చేయ‌డం బాగోద‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో... గౌరు వెన‌క్కు త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఇదిలా ఉంటే... నేటితో నామినేష‌న్ల గ‌డువు ముగియ‌నుండ‌గా కాసేప‌టి క్రితం కేఈ నామినేష‌న్ వేశారు. అదే స‌మ‌యంలో గౌరు నామినేష‌న్ వేయ‌డం లేద‌ని తెలియ‌డంతో ఇక తాను ఏక‌గ్రీవంగానే విజ‌యం సాధిస్తాన‌ని కూడా కేఈ భావించారు.

అయితే కేఈ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేసిన చందంగా ఓ ముగ్గురు అభ్యర్థులు కాసేప‌టి క్రితం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. వీరిలో బీఎస్పీ అభ్యర్థి దండు శేషుయాదవ్ కాగా - మరొకరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు - ఇంకొకరు ఎంపీటీసీల సంఘం నాయకుడు జయప్రకాశ్ రెడ్డి ఉన్నారు. అనూహ్యంగా ఈ ముగ్గురు నామినేష‌న్లు వేయ‌డంతో ఏక‌గ్రీవంగానే ఎన్నిక‌వుదామ‌న్న కేఈ ఆశపై నీళ్లు చ‌ల్లేసిన‌ట్లైంది. ఈ ముగ్గురు కూడా జిల్లాలో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌గ‌లిగే నేత‌లేమీ కాదు. అస‌లు వీరి గురించి జ‌నాల‌కు పెద్ద‌గా తెలియదు కూడా. ఒక‌వేళ జిల్లా కేంద్రంలో వీరు కాస్తంత క్రియాశీలంగానే ఉన్నా... జిల్లావ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ప్ర‌భావితం చేసేంత శ‌క్తి వీరికి లేద‌నే చెప్పాలి. ఈ లెక్క‌న చూసుకుంటే... వీరు ముగ్గురు బ‌రిలో ఉన్నా కేఈ విజ‌యం సునాయ‌స‌మే. అయితే పోలింగ్ త‌ప్ప‌నిస‌రి. ఇదిలా ఉంటే దీనిపై మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు రేపు సాయంత్రం దాకా సమ‌యం ఉంది. ఆలోగా ఈ ముగ్గురు కూడా త‌మ నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశాలే లేక‌పోలేద‌ని తెలుస్తోంది. ఈ దిశ‌గా వారి నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేలా టీడీపీ నేత‌లు ఇప్ప‌టికే రంగంలోకి దిగిన‌ట్లుగా తెలుస్తోంది.