Begin typing your search above and press return to search.

నిరసన కూడా చేయలేదంటే బాగుండేది కేఈ

By:  Tupaki Desk   |   13 Jun 2016 5:08 AM GMT
నిరసన కూడా చేయలేదంటే బాగుండేది కేఈ
X
వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం.. తర్వాత తీరిగ్గా లెంపలేసుకోవటం కొంతమంది నాయకులకు అలవాటే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెలుగు తమ్ముళ్ల విషయంలో చోటు చేసుకుంది. ఇటీవల రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికను నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ నిరసన చేయటం సంచలనంగా మారింది. ఎంపీ అభ్యర్థిగా టీజీ వెంకటేశ్ ను ఎంపిక చేయటాన్ని తప్పు పడుతూ.. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆయన పార్టీ కార్యాలయం దగ్గర ధర్నా చేయటం అందరిని విస్మయానికి గురి చేసింది.

ఏపీలో ఎదురులేని అధినేతగా అవతరించిన చంద్రబాబును తప్పు పట్టేలా కేఈ ప్రభాకర్ వ్యవహరించటంపై రకరకాల వాదనలు వినిపించాయి. అందరి వేళ్లు తనవైపు చూపిస్తున్న నేపథ్యంలో కేఈ ప్రభాకర్ సోదరుడు.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ.. ఆ విషయంలో తనకు సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే ఎవరి విషయంలో అయినా కఠినంగా వ్యవహరించాలని.. తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే అన్నట్లుగా మాట్లాడారు.

ఇదిలా ఉంటే.. కేఈ ప్రభాకర్ తీరును తప్పు పడుతూ.. పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి తాజాగా సమాధానం ఇచ్చిన కేఈ ప్రభాకర్ తనదైన శైలిలో సమాధానం ఇవ్వటం గమనార్హం. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీని విమర్శిస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యల్ని చేయలేదని కేఈ ప్రభాకర్ చెప్పుకోవటం విశేషం. బీసీ సంఘాలు తన దగ్గరకు వచ్చిన నేపథ్యంలో ఆ పని చేసినట్లుగా చెప్పుకున్న ఆయన.. తాను చేసింది తప్పని భావిస్తే మన్నించండి అంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

తాను పార్టీకి విధేయుడినని.. పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఎలాంటి పనులు చేయనని చెప్పుకున్నారు. కేఈ ప్రభాకర్ మాటలే నిజం అనుకుంటే.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేత నిర్ణయాన్ని తప్పు పట్టటం.. పార్టీను దెబ్బ తీసినట్లు కాదా? విధేయుడైన పార్టీ నేత అలాంటి పనులు చేస్తారా?పార్టీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదంటూ చెబుతున్న కేఈ మాటల్లో నిజం ఎంతన్నది నిరసన నాటి వీడియో టేపుల్ని.. ఆయన మాటల్ని ఒకసారి వింటే ఇట్టే అర్థమవుతుంది. అయినా.. తప్పుగా మాట్లాడలేదంటున్న కేఈ.. నిరసన కూడా చేయలేదని చెప్పి ఉంటే మరింత బాగుండేదేమో..?