Begin typing your search above and press return to search.

సీమలో కంచుకోటకు బీటలు..టీడీపీకి మరొకరు బైబై

By:  Tupaki Desk   |   13 March 2020 8:45 AM GMT
సీమలో కంచుకోటకు బీటలు..టీడీపీకి మరొకరు బైబై
X
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మహా రంజుగా జరుగుతున్నాయి. అసలైన రాజకీయాలేమిటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసులు చూస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇరుకున పెట్టిన చంద్రబాబును ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెడుగుడు ఆడుకుంటున్నాడు. టీడీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు వేసిన పథకం విజయవంతమవుతోంది. అధికార పార్టీ దెబ్బకు టీడీపీలోని ఉద్ధండపిండాలే బాబ్బాబు అనుకుంటూ జై జగన్ అంటున్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలతో సహా ఎమ్మెల్సీలు - మాజీ ప్రజాప్రతినిధులు తాడేపల్లి బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది టీడీపీకి బైబై చెప్పేసి జగన్ పక్కన చేరగా ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు ప్రముఖులు సిద్ధమయ్యారంట. వారిలో ఒకరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు కూడా చేరతారంట.

ఈ వలసల రాజకీయంతో చంద్రబాబు విలవిలలాడిపోతున్నాడు. చంద్రబాబుతో పాటు ఆయనకు తోడుగా ఉన్న కొంతమందిని మాత్రం వదిలేసి ఇక టీడీపీనంతా ఖాళీ చేయాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీలో చేరికలకు తలుపు తీశారో లేదో పొలొమని తండోపతండాలుగా చేరిపోతున్నారు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్న ఆయన జగన్ పక్కన చేరేందుకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో అసంతృప్తికి గురైన కేఈ ప్రభాకర్ అధికార పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నారంట. తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నాడు. అయితే ప్రభాకర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సోదరుడు. ఆయన కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్ మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ప్రభాకర్‌ డోన్ నుంచి పోటీచేసి చేసి ఓడిపోవడంతో శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవిని ప్రభాకర్‌ కు ఇచ్చారు. అయితే తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, టీడీపీ పని అయిపోయిందని భావించి వైఎస్సార్సీపీలో చేరనున్నారంట.

ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి - చంద్రబాబుకు సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి కూడా పార్టీ మారనున్నాడట. మాజీ మంత్రి - టీడీపీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు కూడా వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి విజయం సాధించి మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌ సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఈయన కూడా వైఎస్సార్సీపీలో చేరితే ప్రకాశం జిల్లాలో టీడీపీకి చతికిల పడనుంది. ప్రస్తుతం కీలక నాయకులంతా జగన్ పక్కకు రావడంతో ఆ పార్టీకి నాయకులు కరువయ్యారు.