Begin typing your search above and press return to search.

క‌ర్నూలులో టీడీపీ అనుకున్న‌దే జ‌రిగింది

By:  Tupaki Desk   |   29 Dec 2017 4:37 PM GMT
క‌ర్నూలులో టీడీపీ అనుకున్న‌దే జ‌రిగింది
X
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విష‌యంలో అనుకున్న‌దే జ‌రిగింది. ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. డిక్లరేషన్ ప‌త్రాన్ని కేఈ ప్రభాకర్ ఎన్నికల అధికారి నుంచి అందుకున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేర‌డం - ఆయ‌న రాజీనామాతో ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే.

కాగా, క‌ర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక‌ ఏకగ్రీవం దిశగా ముందునుంచే సాగింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ బ‌రిలో నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ...టీడీపీ అభ్య‌ర్థి కాకుండా మ‌రో ఇద్దరు బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా శేషుయాదవ్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఎంపీటీసీ సంఘం నాయకుడు జయప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సమావేశమయ్యారు. మొత్తంగా వైసీపీ ముందే పోటీ నుంచి తప్పుకోవడంతో టీడీపీకి ఏకగ్రీవమయ్యే అవకాశముందని అంచ‌నా వేశారు.

ఈ ఎన్నిక‌పై మొద‌టి నుంచే వివిధ ర‌కాల అంచనాలు వెలువ‌డ్డాయి. నామినేషన్ వేసిన వారిని ఉపసంహరింపజేసి కర్నూలు స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉందని...ఈ నేప‌థ్యంలో తాము ఇండిపెండెంట్ల‌ను `ఏదో రూపంలో` `మేనేజ్‌` చేయ‌గ‌ల‌మ‌ని టీడీపీ నేత‌లు విశ్వాసం వ్య‌క్తం చేశారు.