Begin typing your search above and press return to search.

ఓ వర్షమా..ఇంగ్లండ్‌ లో కాదు..మా రాష్ట్రానికి వెళ్లు: భారత క్రికెటర్

By:  Tupaki Desk   |   14 Jun 2019 4:51 AM GMT
ఓ వర్షమా..ఇంగ్లండ్‌ లో కాదు..మా రాష్ట్రానికి వెళ్లు: భారత క్రికెటర్
X
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ టోర్నీపై అభిమానుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. దీనికి కారణం అక్కడ కురుస్తున్న వర్షాలే. ఇంగ్లండ్‌ లో ప్రస్తుతం వేసవి కాలం నడుస్తున్నప్పటికీ అకాల వర్షాలు ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో క్రికెట్ మ్యాచ్‌ లపైనా ఆ ప్రభావం పడుతోంది. కొన్ని మ్యాచ్‌ లకు అంతరాయం ఏర్పడగా - ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇందులో భారత్ ఆడాల్సిన మ్యాచ్ కూడా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి)పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇక గురువారం భారత్ - న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచీ ఈ మ్యాచ్ జరిగేది అనుమానమే అని వార్తలు వచ్చాయి. అయితే, ఒకానొక సందర్భంలో మ్యాచ్ జరుగుతుంది కానీ, కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. దీంతో ఇరు దేశాల అభిమానులు ఆశావాహ దృక్పదంతో వేచి చూశారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెటర్లు కూడా ఎప్పుడు వర్షం తగ్గుతుందా అని అనుకున్నారు. కానీ, వరుణ దేవుడు మాత్రం కరుణించలేదు. దీంతో మ్యాచ్ రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించి - ఇరు జట్లకు చేరే పాయింట్ కేటాయించారు.

నిన్నటి మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ కేదార్ జాదవ్‌ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. కొంత సమయంలోనే ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది. వర్షం జోరుగా కురుస్తున్న సమయంలో ఈ ఆల్‌రౌండర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి, ఆకాశం వైపు చూస్తూ ‘‘ఓ వర్షమా.. వెళ్లు.. వెళ్లు. మా మహరాష్ట్రకు వెళ్లు. అక్కడి ప్రజలు వర్షాలు పడక కరువుతో అల్లాడుతున్నారు. అక్కడికి వెళ్లి వారికి ఉపశమనం కలిగించు’’ అని వరుణ దేవుడికి ప్రార్థన చేశాడు. దీనిని సహచర క్రికెటర్ వీడియో తీయడంతో ఇది బయటకు వచ్చింది.

మహారాష్ట్రలోని పూణెకు చెందిన కేదార్ జాదవ్.. తన రాష్ట్రం కోసం ప్రార్థన చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. వాస్తవానికి మహారాష్ట్రలో వర్షాలు పడక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఏడు శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని - ప్రజలు తమ అవసరాన్ని బట్టే వాడుకోవాలని అధికారులు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఈ కారణంగానే టీమిండియా ఆల్‌ రౌండర్ కేదార్ జాదవ్ పై విధంగా స్పందించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, చాలా మంది అతడిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.