Begin typing your search above and press return to search.

పెట్రోల్.. డీజిల్ డబ్బాల్ని సిద్ధం చేయాలంటూ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Dec 2019 10:31 AM GMT
పెట్రోల్.. డీజిల్ డబ్బాల్ని సిద్ధం చేయాలంటూ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
X
ఇవాల్టి డిజిటల్ కాలం లో బుద్ధి గా మాట్లాడటం.. ఆలోచించేలా వ్యవహరించటం లాంటివి పక్కన పెట్టేస్తున్నారు. ఏం చేసినా సంచలనంగా మారాలి. ఏం చేసినా ఆరాచకంగా మారాలి. సోషల్ మీడియా లో వైరల్ అవ్వాలి. టీవీ ఛానళ్ల లో బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. తాను మాట్లాడిన తర్వాత ఎవరూ నిద్ర పోకూడదన్నట్లు గా మాట్లాడటం ఈ మధ్యన అలవాటైంది.

ఒడిశాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఇప్పుడు ఇలానే వ్యవహరిస్తున్నారు. ఒక మైనర్ బాలిక అత్యాచారం చేసిన ఉదంతంలో నిందితుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు గా సదరు నేత ఆరోపించారు. అందుకే.. తన కార్యకర్తల్ని సిద్ధంగా ఉండాలంటూ అతగాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దిమ్మ తిరిగేలా మారటమే కాదు.. ఇదేం పోయేకాలం.. ఇంత బాధ్యతారాహిత్యం గా మాట్లాడతారాన్న ఆగ్రహం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

జరిగిన దారుణంపై ఒడిశాలోని నవరంగ్ పూర్ లో చేపట్టే 12 గంటల బంద్ ను నిర్వహించాలని విపక్ష నేతగా డిసైడ్ అయ్యారు. దీనికి తగ్గట్లే తాజాగా నవరంగ్ పూర్ లో మీట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారాయి. రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచార ఘటన పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మీకు సమాచారం అందగానే మొత్తం తగలబెట్టేయండి.. ఏం జరుగుతుందో తర్వాత చూద్దామన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిరసన నిర్వహించటం తప్పు కాదు.. హింస చెలరేగేలా మాట్లాడటం.. రెచ్చగొట్టే తీరును ప్రదర్శించటం తప్పు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మైనర్లు ఎక్కువగా ఉన్న జిల్లాలో అమాయకులైన బాలికలు అత్యాచారాలకు.. హత్యలకు గురి అవుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని.. అలాంటప్పుడు తాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నారు. నవరంగ్ పూర్ లో మరో మైనర్ బాలిక హత్యాచారానికి గురైందన్న ఆయన.. తన వ్యాఖ్యల మీద వెల్లువెత్తుతున్న విమర్శల్ని ఆయన సమర్థించుకున్నారు. తాను చేసిన సూచనలో ఎలాంటి తప్పు లేదని వాదించటం గమనార్హం.