Begin typing your search above and press return to search.

బాలు విగ్రహం తొలగింపు.. ఏర్పాటు చేసిన ఏడాది తర్వాతనా? ఇంతకాలం ఏం చేసినట్లు?

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:11 AM GMT
బాలు విగ్రహం తొలగింపు.. ఏర్పాటు చేసిన ఏడాది తర్వాతనా? ఇంతకాలం ఏం చేసినట్లు?
X
చేయటానికి పనేమీ లేనట్లుగా వ్యవహరించే ధోరణి ఏపీ అధికార పక్షంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు వివాదాలు ఏమీ లేవన్న దిగులు చుట్టుముట్టేసే వేళ.. ఆ కొరతను తీర్చుకునేందుకు సిత్ర విచిత్రంగా వ్యవహరించే ధోరణి అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది.

ఇప్పుడు కూడా అలానే వ్యవహరించారా? అన్నది ప్రశ్నగా మారింది. ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరులో ఏర్పాటు చేయటం తెలిసిందే.

గత ఏడాది జూన్ లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని తాజాగా గుంటూరు కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని బాలూ సార్ విగ్రహాన్ని ఇలా చేస్తారా? ఇంత అవమానానికి గురి చేస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కీర్తి రియాక్టు అయ్యారు.

2021 జూన్ ఐదున నాజ్ సెంటర్లో బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా నగర కార్పొరేషన్ అనుమతిని ఇచ్చిందని.. అయితే అనుమతించిన ప్రాంతంలో కాకుండా మదర్ థెరీసా సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు.

అనుమతి లేని ప్లేస్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కారణంగా దాన్ని తొలగించినట్లుగా వెల్లడించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కళా దర్బార్ వారికి.. నాజ్ సెంటర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పినట్లుగా పేర్కొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. నిజంగానే అనుమతులకు విరుద్దంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే.. విగ్రహ ఏర్పాటు వేళ మౌనంగా ఎందుకు ఉన్నట్లు? విగ్రహాన్ని తప్పుడు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే.. ఆ విషయాన్ని గుర్తించేందుకు దాదాపు 16 నెలలు పట్టిందా? ఇంతకాలం లేని నొప్పి ఇప్పుడే ఎందుకు మొదలైంది? అనుమతి లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారన్న ఆగ్రహంతో ఎస్పీ బాలు లాంటి ప్రముఖుడ్ని అవమానించటం ఎంతవరకు సబబు? లాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. మరి.. దీనికి నగరపాలక సంస్థ ఏమని బదులిస్తుందో?




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.