Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు

By:  Tupaki Desk   |   20 Jan 2015 11:18 AM GMT
కేజ్రీవాల్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు
X
మీడియాలో కాస్తంత నెమ్మదించినా.. ఢిల్లీ ప్రజల మనసుల్లో కేజ్రీవాల్‌ ఇంకా ఉన్నారా? అన్న ప్రశ్న ఈ మధ్య తరచూ చాలామందికే వస్తోంది. 49 రోజుల ఢిల్లీ ముఖ్యమంత్రిగా అందరికి సుపరిచితులైన ఆయన.. తాను చేసిన తప్పుతో బ్రహ్మాండం లాంటి సీఎం పదవిని వదులుకున్నందుకు ఆయన పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు.

ఇప్పటికే పలుమార్లు తనను ప్రజలు క్షమించాలని ఆయన కోరటం తెలిసిందే. మోడీ మేజిక్‌తో కేజ్రీవాల్‌ ప్రభ కాస్త తగ్గింది. దీనికి తోడు మీడియా సైతం గతంలో మాదిరి కేజ్రీవాల్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో ఆయనకాస్తంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

దీనికి తోడు గతంలో ఆయన వెంట నడిచిన పలువురు నేతలు ఆయనపై విమర్శలు చేసి తమ దారిన తాము పోవటంతో.. ఆయన నాయకత్వంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్‌కు జనాదరణ ఎలా ఉందన్న దానిపై కాస్తంత సందేహాలు ముసుకుంటున్నాయి. తాజాగా ఆయన నామినేషన్‌ దాఖలు సందర్భంగా.. ఆయన వెంట వచ్చిన భారీ జనబలం చూసిన తర్వాత కేజ్రీవాల్‌ ఇమేజ్‌ తగ్గలేదన్న భావన వ్యక్తమవుతోంది.

ఢిల్లీలోని గాంధీ నివాసమైన వాల్మీకి సదన్‌ నుంచి ఉదయం 10.30 గంటలకు వేలాది మంది అనుచరులు వెంట రాగా ర్యాలీగా బయలుదేరారు. తమకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదన్న బలమైన సంకేతాన్ని ఇచ్చేందుకు వీలుగా భారీగానే జనసమీకరణ చేశారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి 49 రోజుల ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేజ్రీవాల్‌పై తమకు అభిమానం తగ్గలేదన్న విషయాన్ని ఢిల్లీ ప్రజలు నిరూపించారా? అన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది.