Begin typing your search above and press return to search.

బీజేపీ దిమ్మదిరిగే డిమాండ్ చేసిన కేజ్రీవాల్

By:  Tupaki Desk   |   26 Oct 2022 7:08 AM GMT
బీజేపీ దిమ్మదిరిగే డిమాండ్ చేసిన కేజ్రీవాల్
X
ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. బీజేపీ రాజకీయ భాషతోనే ఆ హిందుత్వ రూట్ లోనే ఆ పార్టీకి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారు. తెలివైన నేతగా గుర్తింపు ఉంది. ఐయారెస్ అధికారిగా ఉంటూ పొలిటీషియన్ గా టర్న్ తీసుకున్న కేర్జీవాల్ బీజేపీ ఆనుపానులను పూర్తిగా ఔపాసన పట్టి అదే రూట్లో వెళ్తూ ఎక్కడికక్కడ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన పంజాబ్ ఎన్నికల్లో గెలిచి బీజేపీని ఒంటి చేత్తో పక్కన పెట్టేశాక జాతీయ స్థాయిలో రాజకీయ పొలికేక గట్టిగానే పెడుతున్నారు. ఆ సౌండ్ కి బీజేపీ శిబిరం కలవరపడుతోంది. కేజ్రీవాల్ ఇపుడు గుజరాత్ ఎన్నికల్లో కమలానికి రాజకీయ చలి ఏంటో చూపించి గజగజలాడిస్తున్నారు. అక్కడ బీజేపీకి అసలైన ప్రత్యర్ధిని తానే అని ఆయన ముందుకు బలంగా దూసుకువస్తునారు.

ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం అన్నది తెలిసిదే. ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మోడీ అమిత్ షాలకు గుజరాత్ సొంత రాష్ట్రం. సో ఇక్కడ గెలుపు వారికి ప్రాణప్రదం అని అందరికీ తెలిసిందే. దాంతో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న వేళ కేజీవాల్ ఒక క్రేజీ డిమాండ్ ని కేంద్రం ముందు పెట్టారు. భారత్ కరెన్సీ మీద గాంధీజీతో పాటు లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ఈ డిమాండ్ ఆయన గారి వీర హిందూత్వ అజెండాను స్పష్టం చేస్తోంది.

బీజేపీ కంటే హిందూత్వ విషయంలో తాను నాలుగు ఆకులు ఎక్కువ చదివాను అని కేజ్రీవాల్ ఎపుడో చెప్పారు. బీజేపీ రాముడిని పూజిస్తే తాను హనుమాన్ భక్తుడిని అని ఆయన ఏనాడో చాటుకున్నారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి లక్ష్మీదేవి, గణపతి బొమ్మలు కరెన్సీ నోట్ల మీద ముద్రించమంటున్నారు. నిజంగా ఇలాంటి ఆలోచనలు బీజేపీకి రావ్వాలి. కానీ బీజేపీ ఎందుకో ఈ విషయంలో వెనకబడిపోతోందా లేక బీజేపీ హిందూత్వకు ఒక పరిధి పరిమితి పెట్టుకుని అంతవరకే పనిచేస్తోందా అన్న సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.

అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాలో ఆ దేశ కరెన్సీ మీద మన వినాయకుడి బొమ్మను ముద్రించి దాన్నే వారు జన వాడకంలోకి తెచ్చారు. మరి హిందూ దేశమని, ఏనాటికైనా హిందూ రాష్ట్రంగా భారత్ ఉండాలని, అఖండ భారతమని ఎన్నో విషయాలు చెప్పే బీజేపీ పెద్దలకు కరెన్సీ మీద లక్ష్మీదేవి, గణపతి బొమ్మలు పెట్టాలని ఎందుకు తోచలేదు అన్నది ఒక ప్రశ్న అయితే కేజ్రీవాల్ ఈ డిమాండ్ చేసి సరైన సమయంలో కమలనాధులను ఇరకాటంలోకి నెట్టాడని అంటున్నరు.

గుజరాత్ లో హిందూత్వ తో బీజేపీ ఓటు బ్యాంక్ కొల్లగొట్టాలన్న ఉద్దేశ్యంతోనే కేజ్రీ ఈ పావులు కదిపారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ ఏం చేస్తుంది. ఏం చేసినా క్రెడిట్ కేజ్రీ ఖాతాలోకే వెళ్తుంది అన్నది నిజం. ఇది మచ్చుకు ఒక మాస్టర్ మూవ్ అని ఇంకా 2024 సార్వత్రిక ఎన్నికల వేళకు కేజ్రీవాల్ అమ్ముల పొదిలో మరిన్ని హిందూత్వ అస్త్రాలు రెడీగా ఉన్నాయని అంటున్నారు. ఈ వీర హనుమాన్ భక్తుడి ధాటికి రాముడి పార్టీ ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.