Begin typing your search above and press return to search.

రేషన్ డోర్ డెలివరీపై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన కేజ్రీవాల్

By:  Tupaki Desk   |   7 Jun 2021 1:30 AM GMT
రేషన్ డోర్ డెలివరీపై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన కేజ్రీవాల్
X
పిజ్జా, బర్గర్, స్మార్ట్ ఫోన్లు, బట్టలు మొదలైనవి ఇంట్లో డెలివరీ చేయగలిగితే, ఎందుకు రేషన్ అలా ఇంటికే డెలివరీ చేయలేమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆదివారం ఢిల్లీ ప్రభుత్వ "రేషన్ ఎట్ హోమ్" పథకాన్ని ప్రారంభించాలని చూస్తే.. కేంద్రం "అడ్డుకుంటుంది" అని ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో ప్రసంగించిన ఢిల్లీ సీఎం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో నివసిస్తున్న 70 లక్షల రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ అందజేస్తుందని అన్నారు.

మోడీ గురించి ప్రస్తావించిన కేజ్రీవాల్ "సర్, 'ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన'కు అడ్డుతగిలారని.. ఢిల్లీ ప్రభుత్వం డోర్ స్టెప్ రేషన్ పథకాన్ని అమలు చేయలేమని మీరు అభ్యంతరం వ్యక్తం చేశారని విమర్శించారు. అప్పుడు మేము ఈ పథకానికి పేరు పెట్టకూడదని నిర్ణయించుకున్నాము. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం ఆమోదం తీసుకోలేదని అడ్డుచెప్పడం న్యాయం కాదన్నారు. ఈ ముఖ్యమైన పథకాన్ని అమలు చేయడానికి మీ అనుమతి కోరడానికి గత కొన్ని నెలల్లో నేను మీకు 5 లేఖలు రాశాను. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుండి ఎలాంటి అనుమతి అవసరం?" అని బీజేపీ సర్కార్ ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఇంటింటికి రేషన్ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్న కేంద్రసర్కార్ వాదనను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఐదుసార్లు కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకున్నామని తెలిపారు. చట్టపరంగా చూస్తే అసలు కేంద్రం ఆమోదం అవసరమే లేదని వ్యాఖ్యానించారు. ఆ క్రెడిట్ మొత్తం మోడీకే ఇస్తామని.. మోడీ, కేజ్రీవాల్ కలిసి రేషన్ అందిస్తున్నారని ప్రజలు భావిస్తారని.. 70 లక్షల మంది లబ్ధిదారుల తరుఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాని కేజ్రీవాల్ వేడుకున్నారు. పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించండని కేజ్రీవాల్ అన్నారు.

ఈ పథకాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్.జీ) ఫైలును వెనక్కి పంపారు. ఈ పథకానికి కేంద్రప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపకపోవడం ఒక కారణం కాగా.. కోర్టులో కేసు ఉండడం మరొక కారణం.. కేంద్రం కావాలనే అడ్డుకుంటోందని ఆప్ నేతలు మండిపడుతున్నారు.