Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ దాడి చేస్తే.. యుద్ధ ట్యాంకులు కొనుక్కోమంటారా? వ్యాక్సిన్‌పై కేజ్రీవాల్ నిప్పులు

By:  Tupaki Desk   |   31 May 2021 10:30 AM GMT
పాకిస్థాన్ దాడి చేస్తే.. యుద్ధ ట్యాంకులు కొనుక్కోమంటారా?  వ్యాక్సిన్‌పై కేజ్రీవాల్ నిప్పులు
X
దేశ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను హ‌డ‌లెత్తిస్తున్న క‌రోనా సెకండ్ వేవ్ విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు అవ‌లంభిస్తున్న తీరును ప్ర‌తి ఒక్క‌రూ దుయ్య‌బ‌డుతున్నారు. ముఖ్యంగా క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో.. అక్క‌డి కేజ్రీవాల్‌ ప్ర‌భుత్వం కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతోంది. వ్యాక్సిన్ పంపిణీ విష‌యంలో కేంద్రం చేతులు ఎత్తేయ‌డాన్ని.. రాష్ట్రాల‌పై బాధ్య‌త‌ను తోసే యడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతున్నారు.

నిజానికి క‌రోనా తొలి ద‌శ‌లో ప్ర‌ధాని మోడీ.. వెంట‌నే స్పందించి.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో తొలిద‌శ నుంచి కొంత మేర‌కు దేశం బ‌య‌ట‌ప‌డింది. అయితే.. సెకండ్ వేవ్ వ‌చ్చే స‌రికి మాత్రం లాక్ డౌన్ స‌హా.. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో కేవ‌లం సూచ‌న‌లు, అభిప్రాయాలు, స‌మీక్ష‌ల వ‌ర‌కే మోడీ ప్ర‌భుత్వం ప‌రిమిత‌మైంది. అదేస‌మ‌యంలో వ్యాక్సిన్ పంపిణీ విష‌యంలోనూ మాట‌లే త‌ప్ప‌.. చేత‌ల్లో పెద్ద‌గా దూకుడు చూపించ‌లేక పోతోంది. ఈ ప‌రిణామాల‌పై ఢిల్లీ స‌హా బెంగాల్‌, ఏపీ, జార్ఖండ్‌, ఒడిశా, తెలంగాణ‌ స‌ర్కారులు ఆగ్ర‌హంతో ఉన్నాయి.

అయితే.. ఆయా రాష్ట్రాల సీఎం కొంత సంయ‌మ‌నం పాటిస్తున్నా..కేజ్రీవాల్ మాత్రం కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. ``పాకిస్థాన్.. దేశంపై దాడి చేస్తే.. ర‌క్షించాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం.. మీరే యుద్ధ ట్యాంకులు కొనుక్కోండి! అని చెబుతుందా? పొరుగు దేశం దాడి చేస్తే.. రాష్ట్రాలే ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవాల‌ని సూచించి చేతులు దులుపుకుంటుందా?``- అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం కేజ్రీవాల్ చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వాస్త‌వానికి ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా క‌రోనా విష‌యంలో ముందస్తుగా దృష్టి సారించి నిర్ణ‌యం తీసుకు న్నాయ‌ని.. మ‌న దేశంలో మాత్రం వ్యాక్సిన్ విష‌యంలో ఆరు మాసాల ఆల‌స్యంగా కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచింద‌ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నిజానికి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల్లోనూ వాస్త‌వం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా వంటి మ‌హ‌మ్మారి విజృంభించిన‌ప్పుడు 1897 అంటు వ్యాధుల చ‌ట్టాన్ని తెర‌మీదికి తెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. తొలినాళ్ల‌లో బాధ్య‌త తీసుకున్నా.. రెండో ద‌శ వ‌చ్చే స‌రికి మాత్రం ఎక్క‌డ త‌మ‌పై ఆర్థిక బారం ప‌డుతుందోననే కార‌ణంతో.. ఈ బాధ్య‌త నుంచి త‌ప్పుకొంద‌ని నెటిజ‌న్లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో రెండో ద‌శ‌కు వ‌చ్చే స‌రికి.. లాక్‌డౌన్ స‌హా.. వ్యాక్సిన్ పంపిణీ వంటి విష‌యాల్లో తాను కేవ‌లం సూచ‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది తొలి ద‌శ‌లో కేంద్రం ఇన్షియేట్ తీసుకుని దేశ‌వ్యాప్తంగా లాక్డౌన్‌ను ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ సారి మాత్రం కేంద్రం పూర్తిగా చేతులు ఎత్తేసింద‌ని.. రాష్ట్రాల‌కే బాధ్య‌త వ‌దిలేసి.. చేష్ట‌లుడిగి చూస్తుండిపోయింద‌ని కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేజ్రీవాల్ వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌డం గ‌మ‌నార్హం.