Begin typing your search above and press return to search.

చంద్రుళ్లకు ‘కేజ్రీవాల్’ స్ఫూర్తి అయితే బాగుండు !

By:  Tupaki Desk   |   29 March 2016 6:22 AM GMT
చంద్రుళ్లకు ‘కేజ్రీవాల్’ స్ఫూర్తి అయితే బాగుండు !
X
పేర్ల మాదిరే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరించే విధానాలు కుడిఎడంగా ఒకలా ఉంటాయి. ఈ విషయం గడిచిన రెండున్నరేళ్లలో తెలుగు ప్రజలకు బాగానే అర్థమైంది. కాకుంటే.. ఒక విషయంలో ఒకరు ముందుంటే.. మరో విషయం మరొకరు ముందుండే పరిస్థితి. వాయించే పన్నుల్లో కానీ.. ఇచ్చే వరాల్లోనూ పెద్ద తేడా ఏమీ కనిపించదు. దేశంలో ఏం చేసినా తామే మొదట చేస్తున్నట్లుగా చెప్పుకునే అలవాటున్న తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు.. కొన్ని విషయాల్లో మాత్రం చాలా వెనుక పడిపోతున్నారు.

పన్నులు తగ్గించి రోజురోజుకి పెరుగుతున్న ఖర్చుల భారం సామాన్యులపై తగ్గించే ప్రయత్నమే తెలుగు ముఖ్యమంత్రులు చేయడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగే సమయంలో ఇలాంటి ఉపశమనాలు సాధ్యం కాదన్నట్లుగా చంద్రుళ్ల మాటల్లో అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే.. పన్నులు కట్టే వారి ఇంకా పన్నులు పడుతుంటే... పేదల పేరు చెప్పి నచ్చిన వర్గాలకు పథకాల మీద పథకాలు ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని అమలు చేసినా.. అందుకు రాబడిని.. పన్ను వర్గాల మీద బాదేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఈ కారణంగా కష్టపడిన సంపాదించిన సొమ్ములో పన్నుల భారం భారీగా పెరగటంతో మధ్యతరగతి జీవి విపరీతమైన అసంతృప్తికి గురవుతున్నాడు. అందరినీ పట్టించుకునే చంద్రుళ్లు.. వీరి విషయాన్ని అస్సలు పట్టించుకోకపోవటం గమనార్హం.

నిజానికి చంద్రుళ్లు మాత్రమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారు తీరుకూడా ఇదే రీతిలో ఉంది. అయితే.. ఈ విషయాన్ని ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న సామాన్యుడు గుర్తించినట్లు కనిపిస్తోంది. మధ్యతరగతి జీవుల బాధలు ఆయన దృష్టికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. పన్నులు కట్టే వారికి అదే పనిగా పన్నుల మోత మోగించకుండా వారికి ఉపశమనం కలిగించేలా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ లో పలు వస్తువుల మీద ఇప్పటివరకూ అమలు అవుతున్న 12.5 శాతం వ్యాట్ ను 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటమే దీనికి నిదర్శనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాట్ ను మరో శాతం పెంచటమో.. లేదంటే వ్యాట్ జాబితాలో లేని వాటిని పన్నుపోటు కిందకు తేవటమో అందరూ చేస్తుంటే.. అందుకు భిన్నంగా పన్ను పోటును నుంచి ఉపశమనం కలిగించటం కేజ్రీవాల్ సర్కారుకే సాధ్యమైందని చెప్పొచ్చు.

ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ లో వ్యాట్ మీద భారీ కోత విధించటం ద్వారా రాష్ట్ర సర్కారుకు ఆదాయం తగ్గినప్పటికీ.. ఆ రాష్ట్ర ప్రజలకు మిఠాయిలు.. రెడీమెడ్ దుస్తులు.. చేతి గడియారాలు.. పాదరక్షలు.. విద్యుత్ వాహనాలు తదితరాలన్నీ చౌకగా లభ్యం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 5 శాతానికి పన్నును తగ్గించటం కారణంగా ఆయా వస్తు సేవల్లో 7.5 శాతం మేర ధర తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల ప్రతి వెయ్యి రూపాయిల కొనుగోలుకు రూ.75 మేర తగ్గటం చిన్న విషయమేమీ కాదు. మరి.. ఇలాంటి విషయాలు తెలుగు చంద్రుళ్లు సైతం దృష్టి పెడితే బాగుంటుంది.