Begin typing your search above and press return to search.

ప్రాణవాయువు రోగానికి కేజ్రీవాల్ మార్క్ సర్జరీ

By:  Tupaki Desk   |   28 April 2021 4:06 AM GMT
ప్రాణవాయువు రోగానికి కేజ్రీవాల్ మార్క్ సర్జరీ
X
అదేమీ పల్లెటూరు కాదు. కానీ.. అనుకోని ఉత్పాతం విరుచుకుపడితే పల్లె.. టౌన్ లాంటి ఊళ్లు పడే ఇబ్బందులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో విలవిలలాడింది. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో.. రోగులకు అందాల్సిన ఆక్సిజన్ అందక కిందామీదా పడిపోవటమే కాదు.. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న పరిణామాల్ని ఏ రీతిలో చెక్ చెప్పాలో తెలీని నిస్సహాయ స్థితిలో.. తమకు ఆక్సిజన్ ట్యాంకర్లను అందజేసి ఆదుకుంటారా? అని రాష్ట్రాల్ని ఆయన కోరారు. ఒకట్రెండు రాష్ట్రాలు తప్పించి.. మరెవరూ సీఎం కేజ్రీవాల్ వినతికి స్పందించలేదు.

తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం.. తమ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సమస్యకు తనదైన శైలిలో పరిష్కారాన్ని వెతికారు. ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేయటమే కాదు.. రానున్న నెలలో ఢిల్లీ వ్యాప్తంగా 44 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపదికన.. పలు దేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్న కేజ్రీ సర్కారు.. తాను అనుకున్నట్లు చేస్తే.. మరో నెలలో ఆక్సిజన్ కొరత అన్నదే ఉండదని చెబుతున్నారు.

ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 44 ఆక్సిజన్ ప్లాంట్లలో ఎనిమిది ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ నెల 30 నాటికి (అంటే.. మరో రెండు రోజుల్లో) ఎనిమిది ప్లాంట్లను రెఢీ చేస్తున్నారు. ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తున్న 36 ఆక్సిజన్ ప్లాంట్లలో 21 ప్రాన్స్ నుంచి.. మిగిలిన 15 దేశీయంగా పలు సంస్థల నుంచి సమకూర్చుకోనుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్లను వేర్వేరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. దీంతో.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించటానికి ఇది సాయం చేస్తుందని చెబుతున్నారు.

ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న నేపథ్యంలో బ్యాంకాక్ నుంచి 18 ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకోవటంతో పాటు.. థాయ్ లాండ్ నుంచి ఆక్సిజన్ చేసుకునేందుకు వైమానిక దళానికి విమానాల్ని ఇవ్వాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరింది. మొత్తంగా ఢిల్లీని పట్టి పీడిస్తున్న ఆక్సిజన్ సమస్యకు చెక్ పెట్టేలా కేజ్రీవాల్ ప్లానింగ్ ఉందని చెప్పాలి.