Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ నినాదం బాగుందే

By:  Tupaki Desk   |   2 May 2022 4:03 AM GMT
కేజ్రీవాల్ నినాదం బాగుందే
X
గుజరాత్ లో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారం బరూచ్ లో జరిగిన ఆదివాసీ సంకల్ప్ మహాసమ్మేళనంలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను గనుక మార్చకపోతే తమను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని జనాలకు పిలుపునిచ్చారు.

పంజాబ్ లో ఘన విజయం తర్వాత కేజ్రీవాల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పెరిగిపోయినట్లే ఉంది. అందుకనే చెప్పింది చేసి చూపించకపోతే తరమికొట్టండని బహిరంగంగానే చాలెంజ్ చేశారు.

సమ్మేళనంలో అరవింద్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాష్ట్రంలోని స్కూళ్ళని క్షీణదశకు చేరుకున్నట్లు ఆరోపించారు. 6 వేల పాఠశాలలను మూసేసినట్లు చెప్పారు. మరికొన్ని స్కూళ్ళ మూసివేత దశలో ఉన్నాయట. ప్రభుత్వ విధానాల కారణంగానే లక్షలాది చిన్నారుల భవిష్యత్తు అన్యాయమైపోయిందని మండిపడ్డారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం విద్యావ్యవస్ధలో సాధించిన ఘనతను వివరించారు.

విద్యావ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల కారణంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ళనుండి వచ్చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరినట్లు చెప్పారు. గుజరాత్ ప్రజలు ఒకసారి ఢిల్లీకి వచ్చి ప్రభుత్వ స్కూళ్ళ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని బంపర్ ఆపర్ ఇచ్చారు. తన పాలనపై కేజ్రీవాల్ కు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఒక్క అవకాశం ఇవ్వండి చెప్పినట్లు పాఠశాలలను మార్చకపోతే తరిమికొట్టండి అని అంత గట్టిగా చెప్పారు.

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ధనవంతులు, పేదలన్న తేడా లేకుండా అందరు చదువుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 99.7 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. మొత్తం మీద తన పరిపాలనను రోల్ మోడల్ గా చూపించుకుని కేజ్రీవాల్ ఓట్లడుతున్నారు.

ఈ పద్దతిలోనే పంజాబ్ లో గ్రాండ్ సక్సెస్ కొట్టారు. గుజరాత్ దురహంకారాన్ని దెబ్బకొట్టేందుకు ఆప్ కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని కేజ్రీవాల్ జనాలకు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ఆప్ గుజరాత్ లో ఈసారి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. కాకపోతే ఆప్ వల్ల కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగులుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.