Begin typing your search above and press return to search.

ఒక‌టో త‌ర‌గ‌తి సీటుకు ల‌క్ష లంచం...ప్రిన్సిపాల్ అరెస్టు!

By:  Tupaki Desk   |   10 April 2018 11:42 AM GMT
ఒక‌టో త‌ర‌గ‌తి సీటుకు ల‌క్ష లంచం...ప్రిన్సిపాల్ అరెస్టు!
X
బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన‌ - నిరుపేద‌కుటుంబాల‌కు చెందిన విద్యార్ధుల‌కు నాణ్య‌మైన విద్యనందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కేంద్ర ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో అవినీతి రాజ్య‌మేలుతోంది. ధ‌నార్జ‌నే ధ్యేయంగా లంచాల‌ రుచిమ‌రిగిన ఓ ప్రిన్సిప‌ల్....పేద‌ల‌ను పీల్చి పిప్పి చేస్తున్నాడు. త‌న‌కు లంచం ఇవ్వ‌కుంటే పాఠ‌శాల‌లో అడ్మిష‌న్ ఇవ్వ‌న‌ని తెగేసి చెబుతున్నాడు. ఆ ప్రిన్సిపాల్ వైఖ‌రితో విసిగిపోయిన ఓ తండ్రి ....అత‌డి అవితీతి బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టాడు. దీంతో, ఆ లంచ‌గొండి ప్రిన్సిపాల్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. చెన్నైలోని కేంద్రీయ విద్యాల‌యం స్కూల్ లో జరిగిన ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం రేపింది.


చెన్నైలోని అశోక్ నగర్ లో 1981లో కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం స్థాపించింది. ఉచితంగా నాణ్య‌మైన విద్య‌నందించే ఆ పాఠ‌శాల‌లో త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించాల‌ని నిరుపేద కుటుంబాల‌వారు భావిస్తుంటారు. అదే త‌ర‌హాలో ఆర్ టీఈ కోటాలో తన కుమారుడికి సీటు ఇవ్వాలని దళిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ప్రిన్సిపాల్ ను అడిగాడు. ఆ కోటాలో సీటు ఇచ్చేందుకు ప్రిన్సిపల్ అనంతన్ రూ.లక్ష లంచం అడిగాడు. రూ. లక్ష లంచం ఇవ్వలేన‌ని ఆ నిరుపేద తండ్రి ప్రాధేయ‌ప‌డినా అనంత‌న్ విన‌లేదు. దీంతో, అనంత‌న్ పై ఆ తండ్రి సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తండ్రి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటున్న అనంతన్ ను ఆయన చాంబర్ లోనే సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మంగ‌ళ‌వారం అరెస్టు చేశారు. అనంతన్ ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో అత‌డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే చాలామంది ద‌గ్గ‌ర అనంత‌న్ లంచం తీసుకున్న‌ట్లు త‌మ ప్రాథ‌మిక దర్యాప్తులో వెల్ల‌డైన‌ట్లు అధికారులు చెప్పారు.