Begin typing your search above and press return to search.

మోదీ వ‌ద్ద‌కు ట్రంప్ న‌మ్మిన బంటు వ‌చ్చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   22 Jun 2017 6:09 AM GMT
మోదీ వ‌ద్ద‌కు ట్రంప్ న‌మ్మిన బంటు వ‌చ్చేస్తున్నారు!
X
అమెరికా, భార‌త్‌ల మ‌ధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ద్వైపాక్షికంగానే కాకుండా ఇత‌ర అంశాల్లోనూ భార‌త్ వాద‌న‌కు అమెరికా మ‌ద్ధ‌తుగా నిలుస్తూనే ఉంది. అదే స‌మ‌యంలో భార‌త్ కూడా అమెరికా మాట కాద‌ని ముంద‌డుగు వేయ‌డం లేదు. అమెరికాకు అధ్య‌క్షులు ఎంద‌రు మారినా... ఇదే త‌ర‌హా వాతార‌ణం క‌నిపిస్తోంది. న‌రేంద్ర మోదీ భార‌త ప్ర‌ధాని అయ్యాక‌... నాటి అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికారు. అమెరికాలో మోదీకి ల‌భించిన ప్ర‌జాద‌ర‌ణ చూసి ఒబామా పుల‌కించి పోయారు కూడా. అయితే అమెరికా అధ్య‌క్షుడిగా ఒబామా ప‌ద‌వీకాలం ముగియ‌డం, కాస్తంత దూకుడు స్వ‌భావం క‌లిగిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు ఎలా ఉంటాయోన‌న్న అనుమానం ఉండేది. గ‌తంలో ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాలు భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగుతాయా? అన్న భయాందోళ‌న‌లు కూడా వ్య‌క్తయిన ప‌రిస్థితి.

అయితే ప్ర‌పంచంలో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న భార‌త్ లాంటి దేశంతో స‌త్సంబంధాలను అప్ప‌టిక‌ప్పుడే తెంచేసుకోవ‌డానికి ట్రంప్ తెలివి త‌క్కువ నేత ఏమీ కాదు. అందుకే అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత మోదీకి ఫోన్ చేసిన ట్రంప్‌.. ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌నే కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా అమెరికా ప‌ర్య‌ట‌న‌కు రావాల‌ని, మీ రాక కోసం వేచి చూస్తున్నామంటూ కూడా ట్రంప్‌... మోదీకి ఆహ్వానం ప‌లికారు. త్వ‌ర‌లోనే మోదీ అమెరికాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు కూడా. ఇలాంటి కీల‌క త‌రుణంలో ట్రంప్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇరు దేశాల మ‌ధ్య ప్ర‌స్తుత‌మున్న సంబంధాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డాల‌ని కోరుకున్న కార‌ణంగానే ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌ని ఆ నిర్ణ‌యం విష‌యానికి వ‌స్తే... భార‌త్‌ లో అమెరికా రాయ‌బారిగా త‌న‌కు న‌మ్మిన బంటుగా, త‌న యంత్రాంగంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్యక్తిని పంపేందుకు ట్రంప్ తీర్మానించార‌ట‌. దీనిపై నిన్న‌టి సంచిక‌లో అమెరికా ప్ర‌ముఖ ప‌త్రిక *వాషింగ్ట‌న్ పోస్ట్‌* ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని రాసేసింది. దీనిపై ప‌లు వార్తా సంస్థ‌లు అమెరికా అధ్య‌క్ష నివాసం వైట్ హౌస్‌ ను సంప్ర‌దించ‌గా... సానుకూల స్పంద‌నే వ‌చ్చింద‌ట‌. అంటే భార‌త్‌ లో అమెరికా రాయ‌బారిగా ట్రంప్‌ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న వ్య‌క్తే రాబోతున్నార‌న్న విష‌యం తేట‌తెల్ల‌మైపోయంది. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... ట్రంప్‌ కు అంత‌ర్జాతీయ ఆర్థిక‌ వ్య‌వ‌హారాల స‌హాయ కార్య‌ద‌ర్శిగానే కాకుండా అమెరికా నేష‌న‌ల్ ఎక‌న‌మిక్ కౌన్సిల్‌ లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కెన్నెత్ ఐ జెస్ట‌ర్‌ గా వాషింగ్ట‌న్ పోస్ట్ పేర్కొంది. వైట్ హౌస్‌ లోని అన్ని స్థాయిల అధికారుల‌తో పాటు ట్రంప్‌ తోనూ నేరుగా మాట్లాడే వారిలో కెన్నెత్ ఒక‌ర‌ట‌. అంతేకాకుండా ఇత‌ర దేశాల‌తో మోర్ ఫ్రెండ్లీ నేప‌థ్యంతోనే ముందుకు సాగే త‌త్వ‌మున్న కెన్నెత్‌ ను భార‌త్‌ కు రాయ‌బారిగా పంపితే... భార‌త్‌ తో స్నేహం మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతుంద‌న్న‌ది ట్రంప్ భావ‌న‌గా వైట్ హౌస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/