Begin typing your search above and press return to search.

కేరళ అనంత పద్మనాభస్వామి సంపదే కాదు.. ఊరేగింపూ ప్రత్యేకమే!

By:  Tupaki Desk   |   2 Nov 2022 9:57 AM GMT
కేరళ అనంత పద్మనాభస్వామి సంపదే కాదు.. ఊరేగింపూ ప్రత్యేకమే!
X
ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దేవుడిగా రికార్డులకెక్కిన దేవాలయం.. కేరళలోని అనంతపద్మనాభస్వామి గుడి. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దేవస్థానంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర వైఢూర్యాలు, మణి మాణిక్యాలు, నగలు, ఆభరణాలు, కెంపులు, పచ్చలు తదితరాలు అనంత పద్మనాభస్వామి సొంతం. అలాగే ఇంకా ఆ దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ఆరో గదిలో ఇంతకు మించిన సంపద ఉందని అంచనాలు ఉన్నాయి. ఆ ఆరో గది తలుపు తీస్తే ప్రపంచం అంతమవుతుందని, అత్యంత దారుణమైన విషాన్ని చిమ్మే సర్పాలు ఉన్నాయని, మనుషుల్ని చంపి తినే మొసళ్లు ఆ గదికి కాపలా కాస్తున్నాయని, సముద్రపు నీరు ముంచేస్తుందని ఇలా అనేక రకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి.

తద్వారా అనంత పద్మనాభస్వామి దేవాలయం దేశంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కేవలం సంపద విషయంలోనే కాకుండా ఆయన ఊరేగింపు సైతం ప్రత్యేకమేనని తెలుస్తోంది. ఈ ఊరేగింపు 18వ శతాబ్దం నుంచి జరుగుతుండటం విశేషం.

అనంత పద్మనాభస్వామి ఊరేగింపుకు బయలుదేరారంటే తిరువనంతపురంలో విమానాశ్రయంలో విమానాలను ఆపేస్తారట. ఆ ఊరేగింపు పూర్తయ్యే వరకు విమానాలన్నీ ఎక్కడివక్కడ రెక్కలు ముడుచుకుని కొన్ని గంటలపాటు ఉండిపోతాయట. ఈ ఘట్టం ప్రతి సంవత్సరం రెండుసార్లు జరుగుతుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా స్వామివారి ఊరేగింపు నవంబర్‌ 1న మంగళవారం జరిగింది. ఈ క్రమంలో అనంతపద్మనాభస్వామిని ‘ఆరటు’ పేరిట మేళ తాళాలతో, స్వాగత సత్కారాలతో దేవాలయం నుంచి తిరువనంతపురం విమనాశ్రయం రన్‌వే పైకి గొప్ప ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ కరిక్కు(కొబ్బరి కాయ) మండపం వద్ద ఉత్సవమూర్తులను కొద్దిసేపు ఉంచారు. పూజాదికాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని తిరిగి మేళతాళాలతో దేవాలయానికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా దేవదేవుడి ఊరేగింపునకు ఎలాంటి అంతరాయం కలగకుండా తిరువనంతపురం విమానాశ్రయ రన్‌వేను అధికారులు నవంబర్‌ 1న మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మూసివేశారు. ఈ క్రమంలో ఏకంగా ఐదు గంటలపాటు విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లను రద్దు చేశారు. దీంతో 10 విమానాల రాకపోకలు మారాయి. దీంతో ఆ విమానాల ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.