Begin typing your search above and press return to search.

కేరళ బరిలో తొలి ట్రాన్స్ జెండర్.. పోటీ పడుతోంది ఎవరితోనంటే?

By:  Tupaki Desk   |   26 March 2021 6:37 AM GMT
కేరళ బరిలో తొలి ట్రాన్స్ జెండర్.. పోటీ పడుతోంది ఎవరితోనంటే?
X
కేరళలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నియోజకవర్గం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. ఆ రాష్ట్రంలో తొలిసారి ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి బరిలోకి దిగటమే. అయితే.. ఆమెకు ప్రత్యర్థిగా ఉన్న నేత బలమైన నేత కావటం.. ప్రచారం పోటాపోటీగా నడుస్తుండటం ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో జరిగే పోలింగ్ కు ‘వెంగర్’ నియోజకవర్గం నుంచి అనన్య కుమారి అనే ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచారు. డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా దిగిన ఆమెకు టెలివిజన్ సెట్ ఎన్నికల గుర్తుగా కేటాయించారు.

ఆమె పోటీకి దిగిన వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. కేరళలో బలమైన నేతల్లో ఒకరుగా పేరున్న మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. ఎంపీలుగా సీనియర్ నేత .. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి వెన్నుముక లాంటివాడైన పీకే కున్హాలి కుట్టి. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కుంజప్పగా ముద్దుపేరున్న ఆయన.. ఇప్పుడు విచిత్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో తొలి ట్రాన్స్ జెండర్ బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన ప్రత్యర్థి గురించి అనన్య ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘అతను మహిళలు ఇంటి పట్టునే ఉంటే చాలనుకునే భావజాలం కలిగిన వాడు. అతనికి స్త్రీల గురించి ట్రాన్స్ జెండర్ ల గురించి గౌరవం నేర్పడం కోసమే బరిలోకి దిగాను. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యక్ష ఎన్నికల్లోకి అనుమతించటం లేదు. స్త్రీలు.. ట్రాన్స్ జెండర్లు మంచి పాలన అందిస్తారని.. నిస్వార్థంగా పని చేస్తారని నిరూపించదలుచుకున్నా’’ అని వ్యాఖ్యానిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

28 ఏళ్ల అనన్య ఇప్పటికే ఎఫ్ఎం లో రేడియో జాకీగా పని చేస్తున్నారు. కేరళలో తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీ ఆమెనే. కొళ్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్ వరకే చదువుకున్నా.. రేడియో జాకీగా రాణిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతతో పసికూన లాంటి అనన్య తలపడటం.. తన ఘాటైన వ్యాఖ్యలతో చేస్తున్న ప్రచారం ఆమెను అందరిలోనూ స్పెషల్ గా మార్చింది. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.